Vana Mahotsavam | ఉప్పల్, జూలై 8 : పచ్చటి మొక్కలు నాటడమంటే భవిష్యత్తు తరాలకు మంచి భరోసా ఇవ్వడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలోని మైదానంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 30 లక్షల మొక్కలు నాటుతామని మంగళవారం 30 సర్కిళ్లలో 56 చోట్ల 7134 మొక్కలు నాటుతామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని, నాటడంతోపాటు, వాటి సరంక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, హర్టికల్చర్ అడిషనల్ కమిషనర్ సునందా రాణి, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఈఈ నాగేందర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతాప్రవీణ్, కార్పొరేటర్లు శాంతీ సాయిజెన్ శేఖర్, పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, కక్కిరేణి చేతన, మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి, బొంతు శ్రీదేవి, కాలనీవాసులు పాల్గొన్నారు.