మేడ్చల్ రూరల్, ఆగస్టు 11: సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని మునీరాబాద్, పూడూర్, రాజబొల్లారం, రాజబొల్లారం తండా పంచాయతీల పరిధి గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో మంత్రి స్థానిక నేతలతో కలిసి పర్యటిస్తూ స్వయంగా ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాజబొల్లారంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమరా లను ప్రారంభించి, నూతన బస్టాంట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అదే విధంగా పూడూర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన గోసాయిగూడలో యువజన సంఘం భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పేదల సంక్షేమంలో సీఎం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నాడని అన్నారు. నేడు ఏ గ్రామంలో చూసినా వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారంతో పచ్చదనం, రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లతో అభివృద్ధి కనబడుతున్నదని అన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబందు, దళితబందు, కల్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌తో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గణేశ్, బాబు యాదవ్, మాంగ్యా నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఆదర్శ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజమల్లారెడ్డి, జగన్‌రెడ్డి, నారాయణ, సత్యనారాయణ, సుదర్శన్, వెంకటేశ్, మహేశ్, రవినాయక్, గ్రామ వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పూడూర్లో మంత్రికి ఘన స్వాగతం
మంత్రి పర్యటనలో భాగంగా పూడూర్ గ్రామంలో స్థానిక కుల సంఘాల నేతలు, సభ్యులు, కళాకారులు పలు వేషధారణలతో డప్పు చప్పుళ్లు, మేళతాలాలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో ఆలయాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజ లు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని దేవతలను వేడుకున్నారు.
పలు అభివృద్ధి పనులకు మంత్రి హామీ..
మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్ల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి అసంపూర్తి పనులను సొంత డబ్బులు వెచ్చించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మునీరాబాద్‌లో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, గడిమైసమ్మ, పోచమ్మ ఆలయాలను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా పూడూర్ గ్రామ పరిధిలో గౌడ, యాదవ, రజక, కుమ్మరి సంఘాల భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి, పెద్దమ్మగుడి నిర్మాణానికి, మజీద్ వద్ద షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సహయం అందిస్తానని, సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. గోసాయిగూడలో బీరప్పగుడి, భూలక్ష్మీ దేవి గుడుల మరమ్మతులు చేస్తానని తెలిపారు. అదే విధంగా రాజబొల్లారం గ్రామ పరిధిలో కట్టమైసమ్మ, పెద్దమ్మ గుడి, సీసీ రోడ్ల నిర్మాణానికి సహకారం చేస్తానని, రాజబొల్లారం తండాల్లో సీసీ రోడ్లు వేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.