మేడ్చల్, జూన్9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సంక్షేమ సంబురాల కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, నీటి పారుదల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాశ్, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.అర్హులైన నిరుపేదలందరికి ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, బీసీ కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం వంటి పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నడాని పేర్కొన్నారు.
తెలంగాణ రాక ముందు మంచినీటీ కోసం ఎంతో గోస పడ్డామని ఇప్పుడు కృష్ణా, గోదావరి జలాలను ఇంటింటికి ప్రతి నిత్యం సరఫరా చేస్తూ ఆడబిడ్డలకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. మంచినీటి కోసం అనేక ఇబ్బందులు పడిన మహిళలకు ఇప్పుడు మంచినీటి సమస్యే లేకుండా పోయిందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు నీటి పారుదల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలందరూ మద్దతు పలకాలన్నారు. కాగా, సంక్షేమ సంబురాల్లో భాగంగా ఐదు వందల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎంకేబీఆర్ గార్డెన్లో లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగ్యస్త, మేయర్లు వెంకట్‌రెడ్డి, మేకల కావ్య తదితరులు పాల్గొన్నారు.