మేడ్చల్, సెప్టెంబర్17(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందుతున్నదని, సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి అందుతుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమంలో దేశంలోనే అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందన్నారు. మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉన్నదని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందన్నారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో అగ్రగామి..
రాష్ట్ర ఏర్పాటు అనంతరం వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిందని, రైతులు పండించిన ప్రతి ధాన్యపుగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, ఎకరానికి పెట్టుబడి సాయం ఏడాదికి రూ. 10 వేలు, రైతుబీమా పథకం ప్రవేశపెట్టి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటితో పాటు జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ఓఆర్ఆర్ వెలుపల ఉన్న గృహాలకు తాగునీటి సరఫరాను చేస్తున్నామని వివరించారు.
పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం..
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసుకున్న పరిశ్రమలకు టీ-ఐడియా పథకం ద్వారా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రూ.100 కోట్లను విడుదల చేసి వారి ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. నూతన పారిశ్రామిక వాడలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా టీఎస్ఐపాస్ చట్టం కింద ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పలు శాఖల నుంచి అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, డీసీపీ శబరీష్, డీఆర్వో హరిప్రియ, కలెక్టరేట్ ఏవో రామోహ్మన్ రావు, ప్రజాప్రతినిధులు మధుకర్‌రెడ్డి, నారెడ్డి నందారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.