ఘట్కేసర్, జూలై 13: ఘట్కేసర్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో రూ.2 కోట్ల 6 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం శంకుస్థాపనలు జరిపారు. దీనితో పాటే.. గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్వహిస్తున్న ఘట్కేసర్ గ్రంథాలయ భవన పునర్ నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో దాదాపు 30 మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారికి మంత్రి ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు.
నియోజక వర్గంలో దాదాపు 2 వేల మంది మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చి మిషన్లను కూడా అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలోని స్థానికులతో కలిసి భారీ ఊరేగింపును నిర్వహించారు. వార్డు ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ రంగు కాగితాలను చల్లుతూ మంత్రికి స్వాగతం పలికి వార్డులో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ పి.మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు పి.వెంకటేశ్వరావు, సెక్రెటరి మందాడి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరి సుధాకర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, ధర్మారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బండారి దాసు, పద్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.