మేడ్చల్, అక్టోబర్ 29: కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసిందేమీ లేదని, ఆ రెండు పార్టీలు రాష్ర్టానికి చేటు అని మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్, దమ్మాయిగూడలో మంత్రి మల్లారెడ్డి రోడ్డు షో నిర్వహించారు. అడుగడుగునా జనం మల్లారెడ్డికి బ్రహ్మరథం పట్టి.. మంగళహారతులో స్వాగతం పలికారు. పలు చోట్ల గజమాలతో మల్లారెడ్డి అభిమానులు ఆయనను సత్కరించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లారెడ్డి అంటూ నినదిస్తూ మద్దతు పలికారు.
మేడ్చల్‌లోని వివేకానంద విగ్రహం వద్ద మంత్రి మల్లారెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ…కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనన్నారు. 24 గంటల కరెంట్, ఇంటింటికీ మంచినీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశానికి ఆదర్శంగా రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ తదితర ఎన్నో పథకాలు కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంట్, ఇంటింటికీ నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని, మరోసారి మోసపోవద్దన్నారు. ఎంపీగా రేవంత్ రెడ్డిని మేడ్చల్ ప్రజలు గెలిపిస్తే పీసీసీ పదవి తెచ్చుకుని, టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించాలని, కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి, వైస్ రమేశ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, శేఖర్ గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నారెడ్డి, నందారెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డికి స్వాగతం పలికారు.

Hyd10