మేడ్చల్, జూన్ 30 : మూడుచింతలపల్లి మండలం అద్రాస్పల్లి గ్రామంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పర్యటించారు. వారం రోజుల కిందట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుడు భాస్కర్ ఇంటిని శుక్రవారం పరిశీలించారు. ప్రమాద జరిగిన తీరును తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ముదిరాజ్సంఘం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు, ప్రజలతో మాట్లాడారు. ఆత్మీయంగా పలకరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా ఇటీవల మృతి చెందిన నాగిశెట్టిపల్లికి చెందిన వేమారెడ్డి కుటుంబ సభ్యులను అంతకు ముందు మంత్రి పరామర్శించారు.