మేడ్చల్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్పాహార పథకాన్ని శుక్రవారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ను పొందడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డి, పీర్జాదిగూడ వైస్ చైర్మన్ శివగౌడ్, స్థానిక కార్పొరేటర్ హరిశంకర్‌రెడ్డి, డీఈవో విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ నియోజవర్గంలోని ఎంపీహెచ్ఎస్ చిలుకనగర్‌లో ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జడ్పీహెచ్ఎస్ బహుదూర్‌పల్లిలో ఎమ్మెల్యే వివేకానంద్, కూకట్పల్లి నియోజకవర్గం జడ్పీహెచ్ఎస్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ బాలికల పాఠశాలలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.