మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 27 : తెలంగాణ జాతిపితగా సీఎం కేసీఆర్ను హోమంత్రి మహమూద్ అలీ అభివర్ణించారు. నాగారం మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు బతుకులు ఘోరంగా ఉండేవన్నారు. దీన్ని సహించలేని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి, 14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి కేవలం ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు సమాన ప్రాధాన్యతనిచ్చారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో పరాయి పాలకులు కరెంట్, నీళ్లు ఉండవని, మత కల్లోలాలు చెలరేగుతాయని ఎన్నో చెప్పారన్నారు. అయితే సీఎం కేసీఆర్ ఆ మాటలన్ని తప్పు అని నిరూపించారని తెలిపారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చారని, మత కల్లోలాలకు ఆస్కారం లేకుండా చేశారని తెలిపారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, పల్లెలు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చెందాయన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు, ఇంటింటికి నీళ్లు, డంపింగ్యార్డు, వైకుంఠధామం తదితర సౌకర్యాలు సమకూరాయన్నారు.
కరోనా కారణంగా రెండేళ్లు అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీలకు సమకూరిన ఆదాయంతో అభివృద్ధి చేశామని తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూసిందని తెలిపారు. ఈ సందర్భంగా వంద మంది వరకు ముస్లింలు, మహిళలు మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మల్లేశ్, బీఆర్ఎస్ నేతలు భద్రారెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.