మేడ్చల్/కీసర, అక్టోబర్ 26 : ప్రతిపక్షాల కుయుక్తులు చెల్లవని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ, కీసర మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఓడించడానికి శతవిధాల ప్రయత్నిస్తుందన్నారు. వారు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా వారి ఆశలు నేరవేరవని చెప్పారు.
కండ్ల ముందట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు కనిపిస్తుంటే వారిని ఎవరూ నమ్ముతారని ప్రశ్నించారు. మేడ్చల్‌లో బీఆర్ఎస్ను ఓడించేందుకు ఎంత మంది ఏకమైనా ఏమి చేయలేరన్నారు. కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ చైర్మన్ దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ అని, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మెజార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు, తెలంగాణకు పరిపాలన, సంక్షేమ పథకాల అమలును పోల్చి చెప్పాలని ఆయన సూచించారు.
మంత్రి మల్లారెడ్డికి ముదిరాజ్‌ల మద్దతు
మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డికి ముదిరాజ్ సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని నూతన్‌కల్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు బోయిన్‌పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రిని కలిసి మద్దతు తెలిపారు. మద్దతు ప్రకటించిన వారిలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు భూషణం, సభ్యులు సుదర్శన్, నర్సింగ్‌రావు, ఆనంద్, యాదగిరి, దాసు తదితరులు ఉన్నారు.
హ్యాట్రిక్ సాధించడం ఖాయం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థాయిలో సీట్లను కైవసం చేసుకొని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధిస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం చీర్యాల్‌లోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో మండల పార్టీ బూత్ స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
భారీగా చేరికలు..
మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మల్లారెడ్డి కాంగెస్, బీజేపీ నేతలకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. జై కేసీఆర్, జై మల్లన్న అంటూ భారీ నినాదాలతో పార్టీ సమావేశం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నర్సింగ్రావుతోపాటు నాయకులు, కార్యకర్తలు మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేశారు. మంత్రి చామకూర మల్లారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.