మేడ్చల్/కీసర, ఏప్రిల్ 19 : ‘రాష్ర్టానికి సీఎం అయ్యే అర్హత కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికైనా ఉందా?, ప్రజలకు ఏం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నన్ను తిట్టడం తప్పించి ఇంకేమైనా వస్తుందా, ప్రశ్నిస్తాడంటా ఏమీ ప్రశ్నిస్తవు. ఎప్పుడైనా ప్రజల గురించి పార్లమెంట్లో ప్రశ్నించావా’ అంటూ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. కీసర మండలం చీర్యాల్‌లో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల బాగోగుల కోసం కష్టపడుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై అవాకులు చెవాకులు పేలడం తప్పా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వేరే పనే లేదని మండిపడ్డారు.
రాష్ట్రానికి నేను సీఎం అయితా అంటే నేను సీఎం అయితామని పార్టీల నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వారికి అసలు సీఎం అయ్యే అర్హత ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని తెలిపారు. తెలంగాణలో అమలయ్యే అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమకు కావాలని వివిధ రాష్ట్రాల ప్రజలు కోరకుంటున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ మోడల్‌ను అమలు చేసే దమ్ముందా అని మంత్రి ప్రశ్నించారు. 2024లో జరిగే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత డాక్టర్ చామకూర భద్రారెడ్డి పాల్గొన్నారు.