మేడ్చల్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) / మేడ్చల్ రూరల్ : డిసెంబర్ 3న మూడవ సారి బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మచ్చలేని లీడర్ కేసీఆర్ అని, ప్రజల హృదయాల్లో నిలిచారని, ముచ్చటగా మూడోసారి సీఎంగా గెలవడం ఖాయమని అన్నారు. పీల్చే గాలి, పారే నీరు, పండే పైర్లు.. తెలంగాణ జోరు.. అది కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. రాజకీయాలకతీతంగా సబ్బండవర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని, ఇతర రాష్ర్టాలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. తక్కువ సమయంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దారన్నారు. ఓటమి లేని పథకాలతో రాష్ట్రం సంక్షేమంలో దేశంలో నంబరు వన్ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసిన సమీప రాష్ర్టాల ప్రజలు తమకు కూడా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి, ఆది పురుషుడిగా ముఖ్యమంత్రి ప్రజలకు ఆరాధ్యుడయ్యాడని చెప్పారు. 10 నుంచి 33 జిల్లాలు చేసి, పరిపాలనా సౌలభ్యం కోసం కృషి చేశారని తెలిపారు. డిసెంబర్ 3న మూడోసారి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, సురభివాణీ దేవి, దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, ఎంపీపీలు రజితారాజమల్లారెడ్డి, ఎల్లుబాయి, జడ్పీటీసీలు శైలజావిజయానందారెడ్డి, అనితాలాలయ్య, మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, మేకల కావ్య, సామల బుచ్చిరెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్లు మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, దీపికానర్సింహ రెడ్డి, పావనీజంగయ్య యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ శైలజ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, సత్యనారాయణ, నర్సింహ రెడ్డి, దర్శన్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

మేడ్చల్ నియోజకవర్గం దేశంలో ఎక్కడా లేని విధంగా ఉందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, 61 పంచాయతీలు ఉన్నాయన్నారు. ఇతర జిల్లాల ప్రజలకు నివాసయోగ్యంగా మారడంతో రోజు రోజుకు కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఇందులో 95శాతం మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారని తెలిపారు. నియోజకవర్గానికి రూ.40 కోట్ల సీఎం సహాయ నిధి ఇచ్చామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే అన్నారు. జవహర్‌నగర్‌లో 58, 59 జీవోల కింద 40వేల మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు.
ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించ లేదని, ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. పీసీసీ పదవీని డబ్బులతో కొనుక్కున్న రేవంత్ రెడ్డి, నోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గోటికి కూడా సరిపోడని, ఎన్నికల్లో గెలిచేది లేదు, సచ్చేది లేదని అన్నారు.
ఎన్నికల తర్వాత నియోజకవర్గం అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి విన్నవించారు. ఘట్కేసర్ గురుకుల పాఠశాలలో స్థలం ఉన్నదని, దానిలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు నిధులు ఇవ్వాలని, ఒక్కో మున్సిపాలిటీకి రూ.10 కోట్లు ఇవ్వాలని, శామీర్‌పేట చెరువును టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలని, తూంకుంట, శామీర్‌పేట మండలంలోని నిరుపేద గిరిజనులు నిర్మించుకున్న 11వేల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్ అంటే స్కీంలు.., కాంగ్రెస్ అంటే స్కాంలు అని మంత్రి మల్లారెడ్డి అభివర్ణించారు. 75 సంవత్సరాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పని చేసినా అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణ సాధించి 9 ఏండ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజంతా మద్దతివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.