చర్లపల్లి, డిసెంబర్ 13: దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాజశ్యామల యాగం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిశోర్, సైదిరెడ్డిలతో బేతి సుభాష్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారునుందని తెలిపారు. వీరితోపాటు హెచ్‌బీకాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి, ముత్యంరెడ్డి, తదితరులు ఉన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీఆర్ఎస్ పార్టీ దేశంలో చరిత్ర సృష్టించడం ఖాయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా మద్ధతు లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే.. అభివృద్ధి అని ప్రజలందరూ భావిస్తున్నట్లు చెప్పారు.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తున్నదని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో చేస్తున్న రాజశ్యామల యాగంలో రాష్ట్ర ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ భవన ప్రారంభోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బలమల్లు, క్యామ మల్లేశం, బురుగడ్డ నగేశ్, సెవెళ్లి సంపత్, వస్పరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
దేశంలో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ పార్టీయేనని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ త్వరలో ప్రభంజనం సృష్టించబోతున్నదని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మంగళవారం బయల్దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ ఆవిర్భావం వరకు పార్టీలో కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ రాజధాని వీధులు మంగళవారం గులాబీమయమయ్యాయి. దేశ్‌కీ నేత కేసీఆర్‌కు మద్దతుగా దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన అభిమానులు
హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.