హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి గులాబీ సైనికుడు సగర్వంగా చెప్పాలన్నారు. 2014 కంటే ముందు హైదరాబాద్ ఎట్లా ఉండే..ఇప్పుడెంట్ల ఉందో ప్రజలను కలిసి వివరించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, నీటి ట్యాంకుల వద్ద ఫొటోలు దిగి నాడు-నేడు ఫొటోలతో సోషల్ మీడియాలో దుమ్ములేపి.. దమ్ము చూపాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్బీనగర్ వేదికగా జరిగిన బూత్‌లెవల్ కార్యకర్తల సమావేశంలో గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. యువత సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని 30 రోజుల పాటు కష్టపడాలని సూచించారు.
Hyd12
సిటీబ్యూరో/ వనస్థలిపురం, అక్టోబర్ 29 : ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దామని ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క గులాబీ సైనికుడు ఛాతిమీద చేయి వేసుకొని సగర్వంగా ప్రజలకు చెప్పవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, క్రమ శిక్షణతో, ప్రణాళికతో ప్రతి ఓటరును కలిసి వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఆదివారం ఎల్బీనగర్ వేదికగా జరిగిన బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. యువత సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని 30 రోజుల పాటు కష్టపడాలని సూచించారు.
ఎల్బీనగర్ రూపురేఖలు మార్చిన ఘనత మనదే
ఎల్బీనగర్ను వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసి, రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎల్బీనగర్, నాగోల్, బైరమాల్ గూడ చౌరస్తాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని, ఫతుల్లగూడలో మూడు మతాల శ్మశాన వాటిక అద్భుతంగా నిలిచామన్నారు. దేశం మొత్తం మత విద్వేషం రేపుతున్నారని, కానీ ఇక్కడ మూడు మతాలు ఒకేచోట కలిసి ఉండేలా నిర్మాణం చేశామని గుర్తు చేశారు. మూసీపై వంతెన నిర్మాణం చేపడుతామని తెలిపారు. మెట్రోను హయత్‌నగర్ వరకు పొడిగించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరారని, మన సీఎం పెద్ద అంబర్పేట్ వరకు మెట్రోను పొడిగిస్తున్నట్లు ప్రకటించారన్నారు. విద్యా, వైద్యం, అభివృద్ధి, మౌలిక వసతులలో ఎల్బీనగర్కు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
మలక్‌పేట్‌లో రెండేళ్లలో ఐటీ టవర్
టీవీ టవర్ ఫేమస్‌గా ఉన్న మలక్‌పేట్‌లో రెండేళ్లలో ఐటీ టవర్ నిర్మిస్తామని, తద్వారా 20 నుంచి 25వేల మంది యువతకు కొలువులు కల్పించే బాధ్యత తమదేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. పక్కనే ఉన్న మెట్రో నుంచి ఐటీ టవర్‌కు స్కైవాక్ నిర్మించి అద్భుతంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దశాబ్ధాలుగా ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్యను 118 జీవోతో పరిష్కరించామన్నారు. అందులో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేస్తామని హామీ ఇచ్చారు. పారాచూట్ నేతలను నమ్మి మోసపోవద్దని సూచించారు.
కాంగ్రెస్ అభ్యర్థికి ఏం తెలుసు..
ఎల్బీనగర్లో ఏ దిక్కు, ఏ మూల తెలియని మధుయాష్కి అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చాడని, ఆయన తెలుసుకునేలోపే ఎన్నికలు ఐపోతాయని కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్లో ప్రజల అవసరాలు, సమస్యలు ఆయనకేమైనా తెలుసా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డిని అడిగితే ఏ కాలనీలో ఏ సమస్య ఉందో, ప్రజలకు ఏం కావాలో చెబుతాడన్నారు. అసోసియేషన్లు, అపార్ట్మెంట్లు, ప్రజలతో వ్యక్తిగత గుర్తింపు ఉన్న నాయకుడు సుధీర్‌రెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా పదవిని త్యాగం చేయడానికి సిద్ధమనే నాయకుడు సుధీర్‌రెడ్డి అని తెలిపారు. కులం కన్నా గుణం ముఖ్యం. కులం పేరుతో ఓట్లు అడిగే నాయకులను నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ కులం అంటుంది, బీజేపీ మతం అంటుంది.. మన మధ్యన విద్వేషాలు రేపే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఒకటికి పది సార్లు ప్రతి ఓటరును కలవండి..
సభలో బూత్ స్థాయి నాయకులకు కేటీఆర్ స్పష్టమైన దిశా నిర్ధేశం చేశారు. ప్రతి ఓటరును కలిసి మనం ఏం చేశామో, ఏం చేస్తామో వివరించాలన్నారు. అపోహలుంటే తొలగించాలని సూచించారు. స్వాతి ముత్యం సినిమాలో కమల్‌హాసన్ పాత్రను గుర్తు చేశారు. ఒకటికి పది సార్లు ఓటరును కలిసి వారిని చైతన్యం చేయాలన్నారు. మన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయాన్ని వివరించాలన్నారు. కాంగ్రెస్ వస్తే జరిగే నష్టాలను పూసగుచ్చినట్లు చెప్పాలన్నారు. ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతా చారి పేరు పెట్టామని, పనామా చౌరస్తాకు మహా నాయకుడు ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. కులం, మతం, జాతి, ప్రాంతం వంటి ఎలాంటి బేధాలు బీఆర్ఎస్ పార్టీకి లేవన్నారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
2014లో ఎల్బీనగర్ చౌరస్తా ఎట్లుండే.., విద్యుత్ కష్టాలు ఎట్లుండే.., నీటి కష్టాలు ఎట్లుండే.., ఇప్పుడెట్లుంది అనే విషయాలను ప్రస్తావించి సెల్ఫీలు దిగాలన్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయాలన్నారు. మనం నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, నీటి ట్యాంకుల వద్ద ఫొటోలు దిగి “నాడు-నేడు” ఫొటోలతో సోషల్ మీడియాలో దుమ్ములేపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అంటే అంధకారం, కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే మత కల్లోలాలు, కాంగ్రెస్ అంటే దృష్టపాలన, అన్నింటి కంటే మించి కాంగ్రెస్ హయాంలో కర్ఫ్యూల గురించి ప్రజలకు చెప్పాలి. ముఖ్యంగా నాడు కరెంట్ ఉంటే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త లాంటి అంశాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. నాటి కాంగ్రెస్ పాలనకు, నేడు బీఆర్ఎస్ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు ఆర్థమయ్యేలా చెప్పాలి.
2014 కంటే ముందు హైదరాబాద్ నగరం ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నది.. మనం చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనబడుతున్నది. ప్రతి గులాబీ సైనికుడు ప్రతి ఇంటికి వెళ్లాలి.. ప్రతి ఓటరును కలవాలి. తొమ్మిదిన్నర ఏండ్లలో మనం చేసిన అభివృద్ధిని కండ్లకు కట్టినట్లు వివరించాలి. 65 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలనకు, బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనకు తేడా ఏమిటనేది ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలి.
మనం చేసిన అభివృద్ధి ప్రజల కండ్లముందు ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనుల వద్ద సెల్ఫీలు, వీడియోలు తీయండి.. 30 రోజుల పాటు సోషల్ మీడియాలో దుమ్ము లేపేలా పోస్టులు చేసి దమ్ము చూపండి. ప్రతి గులాబీ సైనికుడు ఈ నెల రోజులు కష్టపడాలి. తొమ్మిదిన్నరేండ్లలో మనం ఏం చేశాం.. మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేస్తామనేది చెప్పాలి.