KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం జీవవైవిధ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, నీటి వనరులు, అడవుల సంరక్షణ వంటి కార్యక్రమాలతో జీవవైవిధ్యానికి బాసటగా నిలిచాయని కేటీఆర్ తెలిపారు. మంగళవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హైదరాబాద్ నగర జీవవైవిధ్యాన్ని ఆవిష్కరించే నివేదికను (సిటి బయోడైవర్సిటీ ఇండెక్స్)ను కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరం కోసం ప్రత్యేకంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదికను తయారు చేసిన ఏకైక భారతదేశ నగరంగా హైదరాబాద్ ఘనత సాధించింది. గతంలో ఒకసారి 2012లో (సీఓపీ 11వ సమావేశం) సందర్భంగా హైదరాబాద్, 2017లో కోల్‌కతా ఒకసారి నగర జీవవైవిధ్య సూచిని రూపొందించాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను తిరిగి రెండోసారి రూపొందించిన తాజా నగరంగా హైదరాబాద్ రికార్డులకు ఎక్కిందన్నారు. నగరంలో ఉన్న జీవవైవిద్య పర్యవేక్షణ, పరిరక్షణ, అభివృద్ధికి ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని, బయోడైవర్సిటీ రంగంలో సింగపూర్ చేసిన భాగస్వామ్యానికి గుర్తింపుగా దీన్ని సింగపూర్ ఇండెక్స్ పేరుతో పిలుస్తున్నారని అన్నారు.