Steel Bridge | సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ) / ముషీరాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నగరంలోని పలు ప్రాంతాలల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పూర్తి స్థాయి ఫలాలు సకాలంలో అందేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి పనులతో పాటు వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా హుస్సేన్‌సాగర్ సర్ఫ్లస్ నాలా అభివృద్ధి పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని కేటీఆర్ ఆదేశించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు, నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు ఇందిరాపార్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి పనుల వరకు చేరుకున్న మంత్రి కేటీఆర్, స్టీల్ బ్రిడ్జి పురోగతిని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీఎస్టీ చేరుకున్న మంత్రి కేటీఆర్ అకడ దాదాపుగా పూర్తయిన ర్యాంపు పై నుంచి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న వీఎస్టీ-ఇందిరా పార్ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతున్నదని మంత్రి అన్నారు. ఇప్పటికే నగరంలో పూర్తయిన ఎస్ఆర్డీపీ ఫ్లై ఓవర్ల మాదిరి ఈ స్టీల్ బ్రిడ్జి అద్భుత నిర్మాణంగా మారబోతున్నదని అభిప్రాయపడ్డారు. 2.62కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం దాదాపు 426 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ని తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట వంటి నియోజక వర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉన్నదని, ఇంతటి కీలకమైన ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే.. సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో లక్షలాది మంది నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు ఎస్ఎన్డిపి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మౌలిక సదుపాయాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్‌సాగర్ సర్ఫ్లస్లో నాలాలో చేపడుతున్న పనులను సమీక్షించారు. అశోక్ నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే ఎస్ఎన్డిపి కార్యక్రమంలో భాగంగా వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వరద ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సాగర్ సర్ఫ్లస్ నాలాకు భారీ ఎత్తున నిధులు కేటాయించి రిటైనింగ్ వాల్ వంటి పనుల నిర్మాణం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యేలా స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో వేగంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, సీఈ దేవానంద్, ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్లాన్ రెడీ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశం
ముషీరాబాద్, మార్చి 4: ముషీరాబాద్ నియోజకవర్గంలో అధునాతన హంగులతో ప్రపంచ స్థాయి చేపల మార్కెట్ ఏర్పాటు కోసం ప్లాన్ రెడీ చేయాలని అధికారును మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేయబోయే చేపల మార్కెట్ కోసం అవసరమైన స్థల, నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శనివారం వీఎస్టీ-ఇందిరాపార్కు మార్గంలో చేపడుతున్న స్టీలు వంతెన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్ పనులు సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ చేపల మార్కెట్ అభివృద్ధి అంశాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి చక్కటి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రపంచంలోనే గొప్ప చేపల మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్ పేరు చెప్పేలా తయారు చేయాల్సిన అవసరం ఉందని, మార్కెట్ ఏర్పాటుకు జాగ, డబ్బులు ఇప్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా మంచి డిజైన్‌తో తనవద్దకు రావాలని బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహకు సూచించారు. గాలి వెలుతురు, పార్కింగ్ వంటి సకల సౌకర్యాలతో కూడిన మోడల్ మార్కెట్‌గా ఉండాలన్నారు.