బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తొలి ఏడాది నుంచే టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది చేసిన ఇబ్బందుల వల్లే నియామకాల్లో జాప్యం జరిగిందని, బోర్డును పూర్తి స్థాయి ప్రక్షాళనతో పాటు శాశ్వత ఉద్యోగులతో బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్ షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు.
హైదరాబాద్‌లో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు మెట్రోరైలును ఈసీఐఎల్, పెద్ద అంబర్‌పేట వరకు విస్తరిస్తామని చెప్పారు. రూ. 1000 కోట్లతో వరద నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని, అలాగే కొత్తపేటలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూసీ సుందరీకరణతో ప్రజలకు మెరుగైన సదుపాయాలతోపాటు, ఈస్ట్ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు. స్ధిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం కోసం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
గ్రేటర్‌లోని ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో సోమవారం మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షోకు జనం నీరాజనం పట్టారు. యువనేతకు ప్రజలు, గులాబీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వగా.. జనం చెయ్యెత్తిజై కొట్టారు. జై బీఆర్ఎస్.. జై తెలంగాణ అంటూ.. ముక్తకంఠంతో నినదించారు.
కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది తీరు వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారని, దీని వల్ల నియామకాల భర్తీ కొంత జాప్యం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతుగా మన్సురాబాద్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చాక.. టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ ప్రతిపాదికన నియామకాలు చేపడుతామన్నారు. బోర్డు ప్రక్షాళనతో పాటు శాశ్వత ఉద్యోగులతో బలోపేతం చేస్తామన్నారు. ఇక నియోజకవర్గంలో 42 కాలనీలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యను తొలగించేలా బీఆర్ఎస్ కృషి చేసిందన్నారు. రూ. 1000 కోట్లతో వరద నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేసినట్లు చెప్పారు. కొత్తపేట నుంచి ప్రూట్ మార్కెట్ తరలించి, 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించుకుంటున్నామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ శాంతియుతంగా ఉందన్నారు. ఎలాంటి ప్రాంతాల గొడవలు లేకుండా.. జనాలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని వివరించారు. కరెంట్ కష్టాలు లేవని, తాగునీళ్లు వస్తున్నాయన్నారు. మెట్రోను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు విస్తరించి.. అక్కడి నుంచి పెద్ద అంబర్పేట్ వరకు పొడిగించే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే ప్రణాళికలు ఉన్నాయని, ఇవన్నీ జరగాలంటే కేసీఆర్ పాలనలోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తప్పుడు మాటలతో జనాలను మోసగించేందుకు వస్తున్నారని, పెట్టుబడులు వస్తున్నాయంటే మెరుగైన వసతులు, స్థిరమైన ప్రభుత్వంతోనే సాధ్యం అనే విషయాన్ని జనాలు గుర్తించాలన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసుకోగలిగామని, ఉచిత మంచి నీరు, అన్నపూర్ణ సెంటర్లు, బస్తీ దవాఖానలు, మెరుగైన శాంతి భద్రతలను ఏర్పాటు చేసుకోగలిగామని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ నాయకత్వంలో ప్రజారవాణా, వరద నీటి నిర్వహణ వ్యవస్థ, మెట్రో విస్తరణ చేపడుతామన్నారు. బీఆర్ఎస్ గెలిచినప్పుడే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలిగామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం పరిధిలో ఉన్న ఎన్నో సమస్యలు తొలగిపోయాయని, జీవో నం. 118లో ఉన్న పెండింగ్ ఇబ్బందులను తొలగించే బాధ్యత తనదేనన్నారు. బైరామల్ గూడ, నాగోల్ వరకు ఫ్లైఓవర్లు, అండర్ పాసులను అద్భుతంగా నిర్మించుకున్నామని, ప్లానింగ్‌లో ఉన్న మరిన్ని ప్రాజెక్టులను కూడా త్వరలోనే పూర్తి చేయాలంటే ..బలమైన నాయకత్వం, స్థిరమైన నాయకత్వం కలిగిన బీఆర్ఎస్ రావాలన్నారు. హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. 2008 నుంచి అనుమతులు లేని బిల్డింగ్‌లకు రెండింతలు వస్తున్న ఆస్తి పన్నును తగ్గిస్తామన్నారు. మరికొన్ని కొత్త ఫ్లైఓవర్లు, కాలనీల్లో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. 55 ఏండ్లు దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లతో జనాలకు ఒరిగిందేమి లేదన్నారు.
ఆరు నెలల కొసారి సీఎం మారితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని, ఇప్పటికే కాంగ్రెస్‌లో 11 మంది సీఎంలు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కల్లోలాలు, కరెంట్ కోతలు తప్పవని, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందని, వారికి ఓటేసి మోసపోవద్దన్నారు. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని గెలిపించాలని, మెట్రో విస్తరణ, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, పెండింగ్‌లో ఉన్న జీవోనం. 118లోని పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నయవంచన చేసే కాంగ్రెస్‌కు ఓటేయవద్దని, బీఆర్ఎస్ పాలనతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు.
హైదరాబాద్‌లో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు మెట్రో వ్యవస్థను ఈసీఐఎల్ వరకు విస్తరిస్తామని, అది ఉప్పల్ నుంచే ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలతోపాటు, మూసీ సుందరీకరణ, స్కై వాక్‌లు అన్ని కూడా కండ్ల ముందరే కనిపిస్తున్నాయన్నారు. హైదరాబాద్ వాసులు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కృషి చేస్తున్నదన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కాకుండా ఉప్పల్ నియోజకవర్గంలో వేరేవాళ్లు గెలిస్తే ఇంకా చేయాల్సిన ఎన్నో అభివృద్ధి పనులకు మోక్షం కూడా దొరకదన్నారు. మూసీ సుందరీకరణ జరగాలి అన్నా… ఐటీ కంపెనీలు ఉప్పల్ రావాలన్నా, ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా..సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని, అల్లాటప్పా నాయకులు చేయలేరని చెప్పారు. రోడ్ షోకు వచ్చిన భారీ జనాన్ని చూస్తుంటే లక్ష్మా రెడ్డి గెలిచినంత ఆనందంగా ఉన్నదని, కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కండ్ల ముందరే కనిపిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హస్తినాపురం డివిజన్లోని నందన వనంలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రెండు పర్యాయాలు గెలిచిన సీఎం కేసీఆర్‌తో కరెంట్ సమస్యలు, మంచినీళ్ల బాధలు తప్పాయన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ. 670 కోట్లతో నాగోల్, బైరామల్‌గూడ, ఎల్బీనగర్ జంక్షన్లలో ఫ్లైఓవర్లను నిర్మించుకున్నామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిచిన తర్వాత పెంచిన సిలిండర్ ధరను తగ్గిస్తామని, సౌభాగ్య లక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ. 3వేలు, ఆసరా పింఛన్లను రూ. 5వేలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు రూ. 15 లక్షల వరకు ఆరోగ్య శ్రీ పెంపు, సన్నబియ్యం పంపిణీ, రూ. 5లక్షల కేసీఆర్ బీమాను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొత్తపేట్‌లో వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నామని, కాలనీల్లోకి నీళ్లు రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జీవో నం. 118లో ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని లవబుల్, లివబుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు నగరవాసులను భాగస్వామ్యం చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఓటింగ్ తక్కువ నమోదవుతున్నదని, విద్యావంతులే ఓట్లేయడం లేదన్నారు.