పరిగి, నవంబర్ 13: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదట పరిగి నియోజకవర్గానికి చెందిన భూములకే సాగునీరు అందనున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కులకచర్ల మండలంలోని భూములకు సాగునీరు ముందుగా అందుతుందని, నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇటీవలె మొదటి మోటార్ ప్రారంభించామని, కాంగ్రెస్ వాళ్లు దరిద్రులు అడ్డం రాకపోతే ఈ పాటికి కులకచర్లకు నీళ్లు వస్తుండెనని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరిగి నియోజకవర్గంలోని కులకచర్లలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భయపడేదేమీ లేదని, నీళ్లు బయల్దేరాయని, మొట్టమొదటగా పరిగి నియోజకవర్గంలో కులకచర్ల మండలానికే రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. రాబోయే సంవత్సరం కాలంలోనే కృష్ణా నీరు తెచ్చిచ్చే బాధ్యతను తాను, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తీసుకుంటామని తెలిపారు.
‘ఇక్కడొక కాంగ్రెసోడు మాట్లాడుతున్నాడంట దివానా గాడు నీళ్లు రాలే, నీళ్లు రాలే అంటున్నాడంట, మేమేదో ప్రాణహిత-చేవెళ్ల పెట్టినం, మీరు తీసేసిండ్రు అంటున్నాడంట, ఆ దివానా గాడికి చెప్పండి.. కావాలంటే.. ఆ హౌలగానికి బస్సు పెట్టి పంపిద్దాం, పంపు చాల్ అయ్యిందా? లేదా?, నీళ్లు ఎల్లినయా? లేవా?, ఆడికెల్లి బయలుదేరాయా? లేదా? చూసి రమ్మనుండ్రి!’ అని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మొండోడు, అనుకున్నడంటే బరాబర్ చేసి చూపిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అందరి కంటే ముందు వచ్చి కేసీఆర్‌తో నడిచిన వారు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అని, ఈ విషయాన్ని మరిచిపోరాదన్నారు. హరీశ్వర్‌రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేశామని చెప్పారు. హరీశ్వర్‌రెడ్డి మనతో లేరని, ఆయన ఆత్మ శాంతించాలంటే ఈసారి మహేశ్‌రెడ్డి అద్భుతమైన మెజారిటీతో గెలవాలన్నారు.
మహ్మదాబాద్, గండీడ్లను వికారాబాద్‌లో కలపాలని మహేశ్‌రెడ్డి అడిగారని, మహేశ్‌రెడ్డిని జబర్దస్త్ మెజారిటీతో గెలిపించండి వారం రోజులలో ఈ రెండు మండలాలను వికారాబాద్‌లో కలిపిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కులకచర్ల మండలానికి జూనియర్ కాలేజీ కావాలంటే మహేశ్‌రెడ్డిని గెలిపించాలని, పరిగి మండలానికి పాలిటెక్నిక్, ఐటీఐ కావాలన్నారని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ తెలిపారు. ఈ పనులు కాంగ్రెసోడు చేయాలంటే ఢిల్లీకి పోవాలని, మనకు ఈ సిల్లీ ఫెలోస్ అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మొన్న ఓటుకు నోటు, నేడు సీటుకు రేటు, రేపు పరిగినంతా అమ్మేయడా? అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాపానికి కర్ణాటక రైతులు చెంపలేసుకుంటున్నారని, కరెంటు రాక బాధపడుతున్నారని, మీ బంధువులుంటే ఫోన్ చేసి అడగండి, కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంటు వస్తుందన్నారు. మా పరిగి, కులకచర్ల, గండీడ్, మహ్మదాబాద్, దోమ రైతన్నలు ఒకటే ఆలోచించుకోవాలని, కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా ఆలోచించాలన్నారు. ఆనాడు అర్దరాత్రి బాయికాడ పడుకున్న రోజులు, ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టిన రోజులు మళ్లీ కావాలా ఆలోచించుకోవాలన్నారు.
తొమ్మిదిన్నరేళ్లలో కులం పేరుతో కుంపట్లు పెట్టలేదని, మతం పేరిట మంటలు పెట్టలేదని, ప్రాంతం పేరిట పంచాయతీలు పెట్టలేదని తెలిపారు. కేవలం అభివృద్ది మా కులం, సంక్షేమం మా మతం అని చెప్పారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత ముస్లింలు, దళితులు ఇంకా పేదరికంలో ఉన్నారంటే కాంగ్రెస్ కారణమా? తొమ్మిదిన్నర ఏళ్ల పాలన చేసిన బీఆర్ఎస్ కారణమా? ఆలోచించాలన్నారు. ‘ఆప్నే బార్ బార్ ఉన్కో మోకా దియా, ఉనోనే బార్ బార్ దోకానే దియా’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. మైనారిటీలను కాంగ్రెస్ ఓట్లు వేసే యంత్రంగానే చూసిందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవీ వద్దు, మన ప్రాంతాన్ని మంచిగా చేసుకుందామనుకున్నాం.. తొమ్మిదిన్నర ఏళ్లలో అదే చేశాం అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గుంటెడు భూమి ఉన్న రైతైనా సరే ఆయన చనిపోతే వారం రోజులలోపు రూ.5 లక్షలు ఎల్ఐసీ ద్వారా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.
లంబాడాలు తమ తండాలో తమ రాజ్యం ఉండాలని కొట్లాడారని, వారి పోరాటాన్ని మన్నించి, గుర్తించి, గౌరవించి పరిగి నియోజకవర్గంలోనే 50 పైచిలుకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడం జరిగిందన్నారు. 3 వేల పైచిలుకు గూడాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు 30వేల పైచిలుకు గిరిజన బిడ్డలను ప్రజా ప్రతినిధులుగా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. పరిగి నియోజకవర్గంలోని ప్రతి తండాలో సేవాలాల్ భవన్ కట్టిచ్చే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు. పరిగిలో రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం చేపడుతున్నారని, ప్రతి తండాలో సేవాలాల్ భవన్ నిర్మాణం చేపడతామన్నారు. పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలేనని, కర్ణాటకలో, దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలలో అమలు చేయని కాంగ్రెస్ తెలంగాణలో చేయదన్నారు. ఏది చెప్పినా చేసేది ఒక్క సీఎం కేసీఆర్ అని తెలిపారు. రోడ్ షో సందర్భంగా చూపించిన ఉత్సాహాన్ని ఈ నెల 30వ తేదీన పోలింగ్ రోజు ఓటు రూపంలో వేసి గులాబి జెండా ఎగురవేయడంతో పాటు సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. అంతకు ముందు హెలిపాడ్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పరిగి నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి నాగేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కాసాని వీరేశ్, కొప్పుల అనిల్‌రెడ్డి, పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.