డబుల్ ఇండ్ల పంపిణీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇప్పటికే అధికారులు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్లో గ్రేటర్ మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. గ్రేటర్ పరిధిలో 70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సర్కారు దృష్టి సారించింది. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే 70వేల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు ఈ సమీక్షలో మంత్రులకు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే 75వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో 4500లకు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 70వేల ఇండ్లను ఐదు లేదా ఆరు దశల్లో వేగంగా అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై మంత్రులు పలు సూచనలను తెలియజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని , పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తి చేసి అర్హులను గుర్తిస్తున్నదని మంత్రులు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరికీ ఆయా కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని మంత్రులు ఈ సమావేశంలో చర్చించారు.