ట్యాంక్ బండ్ శివ.. అనాథ అయినా ఎంతో మందికి కావలసిన వాడు. రక్తసంబంధం లేకపోయినా అతనికి అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న ఇలా ఎందరో బంధువులు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్పైనే జీవిస్తూ అక్కడ ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి శివ. వాళ్లలో ఎంతో మంది శివను కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. ట్యాంక్ బండ్ శివగా పేరొందిన తను ఎండ, వాన అని పట్టించుకోకుండా ట్యాంక్ బండ్ మీదనే జీవించేవాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాపిల్లలతో కూడా అదే ట్యాంక్ బండ్ మీద చిన్న గుడిసె వేసుకొని జీవించేవాడు. ఈ విషయం తెలిసిన ‘నమస్తే తెలంగాణ’ ఏడాది క్రితం అతన్ని ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో శివ కష్టనష్టాలు, అతని జీవితంలోని ఎన్నో అంశాలను స్పృశించింది. శివ కథ తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. నెక్లెస్ రోడ్లో ఒక డబుల్ బెడ్రూం ఇంటిని ఇప్పించారు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్.. అసలు ట్యాంక్ బండ్ శివ ఎక్కడ ఉన్నాడు? అతని ఇల్లు ఎలా ఉంది? అని వెతుకుతూ ఒక వీడియో చేసింది. దీనిలో నెక్లెస్ రోడ్డులోని శివ ఇంటికి వెళ్లింది. ఆ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన శివ.. ‘కేటీఆర్ బంగారం వంటి మనిషి. ఆయన మనసు చాలా మంచిది. నాకు ఇల్లు ఇచ్చినట్లే ఆయనకు తెలుసు. కానీ దాన్ని బొమ్మరిల్లుగా మార్చుకున్న సంగతి తెలియదు.
నాకు ఎంత డబ్బు ఇచ్చినా అది నా దగ్గర ఉండదు. దాన్ని కూడా సేవకే ఖర్చు చేస్తా. అయితే కేటీఆర్ ఇచ్చిన ఇల్లు మాత్రం నా పిల్లల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. ఏడాదిగా ఈ ఇంట్లో ఉంటున్నాం. నాకు ఇంత మంచి జీవితం అందించారు కేటీఆర్. నాకు అన్నం పెట్టిన దాత ఆయన.. ఒకసారి నా ఇంటి గడప తొక్కాలనేదే నా కోరిక’ అని చెప్పాడు.
త్వరలో శివ ఇంటికి కేటీఆర్
ట్యాంక్ బండ్ శివ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన కేటీఆర్.. వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని కేటీఆరే స్వయంగా గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్యాంక్ బండ్ శివగా గుర్తింపు పొందిన ఆయన ఎన్నో ఏళ్లుగా ట్యాంక్ బండ్ మీదనే నివాసం ఉండేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్, శివకు సమీపంలోని నెక్లెస్ రోడ్లో డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించారు.
Will visit Shiva’s home soon 😊 https://t.co/hd6gK3rwhc
— KTR (@KTRTRS) September 15, 2022
తనకు మంచి ఇళ్లు ఇప్పించిన మంత్రి కేటీఆర్ ఒక సారి తన ఇంటికి రావాలని ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పిన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించి త్వరలో శివ ఇంటికి వెళ్తానని తెలిపారు. నెట్టింట ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. కేటీఆర్ మనసు బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.