రాష్ట్రంలో సమగ్రాభివృద్ధే ఏకైక ఎజెండాగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని, అలాంటి నాయకత్వానికి అందరూ మద్దతు తెలుపాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల్లో జరిగిన పలు రోడ్ షోలలో ఆయన ప్రసంగించారు. గోషామహల్లో గులాబీ జెండా ఎగురవేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థి నంద కిశోర్ వ్యాస్ బిలాల్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపించి శిక్షణ ఇప్పిస్తామన్నారు. అలాగే ధూల్‌పేటలో జూనియర్ కాలేజీ, కార్యాన్లో 50 పడకల దవాఖానను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక మలక్‌పేటలో ఐటీ టవర్‌ను నిర్మిస్తామన్నారు. మలక్‌పేటలో కష్టపడితే బీఆర్ఎస్ గెలుపు కష్టమేమీ కాదన్నారు. ఎవరికీ భయపడొద్దని, అందరికీ అండగా తానున్నానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధే కులం, సంక్షేమమే మతం అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): సమగ్ర అభివృద్ధే ఏకైక ఏజెండాగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, అలాంటి నాయకత్వాన్ని మళ్లీ మద్దతు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నంద కిశోర్ వ్యాస్‌ను గెలిపించాలని, అలా చేస్తే గోషామహల్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గోషామహల్ నియోజకవర్గంలోని మంగళ్‌హాట్ అమర్ టవర్స్, జుమ్మెరాత్ బజార్, బర్తన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లలో ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. డిసెంబర్ 3 తర్వాత గోషామహల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని, దూల్పేటలో చాలా మంది విగ్రహాలు తయారు చేసే కళాకారులు ఉన్నారని, అలాంటి వారిలో మొదట 200 మందిని చైనాకు పంపించి, మెరుగైన శిక్షణ ఇప్పిస్తామన్నారు. వారికి మరింత మెరుగైన ఉపాధి కల్పిస్తామన్నారు. ‘మంగళ్హాట్లోనూ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. కార్వాన్లో 50 పడకల ఆస్పత్రి నిర్మిస్తాం. ముఖ్యంగా ధూల్‌పేట ప్రాంతంలో జూనియర్ కాలేజీని నిర్మిస్తాం’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఐదేండ్లలో మరింత బ్రహ్మండంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్‌పేట నియోజకవర్గంలోని ఎస్బీఆర్ కాలనీ టీ జంక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ రాక ముందు కరెంటు కష్టాలు చాలా ఉండేవి. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో కరెంటు సమస్యను సంపూర్ణంగా పరిష్కరించాం. నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నాం. దీంతో నగరంలోని అపార్టుమెంట్లలో జనరేటర్లు, ఇండ్లలో ఇన్వర్టర్లు బంద్ అయినవి. మలక్‌పేటలో త్వరలోనే అతి పెద్ద ఐటీ టవర్ రాబోతున్నది. ఏ నగరమైనా అభివృద్ధి చెందాంటే సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ పాలనలో పాతబస్తీలో కర్ఫ్వూలు ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కర్ఫ్యూ లేదు. హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటున్నారు. మలక్‌పేటలో ఐటీ టవర్ వస్తే మహిళలకు, యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డిసెంబర్ 3 తర్వాత రూ.400లకు సిలిండర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదేవిధంగా రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులను జనవరిలో ఇస్తాం. తెల్లకార్డు ఉన్న వారికి దొడ్డు బియ్యం బదులు, జనవరి నుంచి సన్నబియ్యం అందిస్తాం. తొమ్మిదిన్నరేండ్లలో చాలా పనులు చేసుకున్నాం. ముఖ్యంగా మంచి నీటి వసతి బాగా అయింది. మెట్రో మలక్‌పేట దాకా వచ్చింది. ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో పొడిగిస్తాం. దీంతో పాటు ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు లింకు కలిపి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం’. అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మలక్‌పేటలో ఇంకా రెండు ఫ్లై ఓవర్లు రావాలి. వాటి నిర్మించి తీరుతాం. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కనిపిస్తుంటే, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ గజనీలకు అసలు అర్థం కావడం లేదు’ అని అన్నారు. రోడ్‌షోలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు సునరితారెడ్డి, సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, ఆజం తదితరులు పాల్గొన్నారు.
‘గోషామహల్ నియోజవర్గం నగరంలోనే అత్యంత కీలకమైంది. ఇక్కడ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు అధికం. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని పీల్ఖానా, బేగంబజార్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లలో ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఇప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా రాజాసింగ్ గెలిచినా అభివృద్ధి చేయలేదన్నారు. చాలా సమస్యలు ఉన్నా పట్టించుకోలేదన్నారు. ‘మీకు హామీ ఇస్తున్నా… బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌ను గెలిపిస్తే నేను స్వయంగా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తాను’ అని అన్నారు. గోషామహల్ ఏసీపీ ఆఫీసు నుంచి ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తాం. అదేవిధంగా భారీ గోశాలను నిర్మిస్తాం. ఉస్మానియా దవాఖానను మరింత ఆధునీకరిస్తాం’ అని చెప్పారు. అదేవిధంగా విక్టోరియా ప్లే గ్రౌండ్‌ను ఆధునీకరిస్తాం. పార్కింగ్ సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గోషామహల్ అభివృద్ధి కావాలంటే నందకిశోర్ వ్యాస్‌ను గెలిపించాలని కోరారు.