సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వీకెండ్ వచ్చిందంటే చాలు ఔత్సాహికులు అక్కడ వాలిపోతున్నారు. ప్రకృతి ప్రేమికులు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ తమ అనుభూతులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అది ఎత్తయిన కొండ కావడంతో అక్కడి నుంచి చూస్తే ఔటర్ రింగు రోడ్డు ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది. ఇలా ట్విట్టర్లో శంతను రెడ్డి అనే నెటిజన్ ఇటీవల మంత్రి కేటీఆర్‌కు కొహెడ గుట్ట మీదుగా ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ అద్భుతంగా కనిపించే చిత్రాన్ని పోస్టు చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఓఆర్ఆర్ను అందంగా వీక్షించేలా ఉన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కొహెడ గుట్టను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.
దీంతో హెచ్ఎండీఏ అధికారులు కొహెడ గుట్టను ఇటీవల సందర్శించి పరిసర ప్రాంతాలను, రోడ్డు మార్గం వంటి మౌలిక వసతులపై ఆరా తీశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని అధికారులు తెలిపారు. కొహెడ గుట్టను వ్యూ పాయింట్‌గా అభివృద్ధి చేసి, మౌలిక వసతులను కల్పిస్తే మంచి పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం ఉన్నదన్నారు. తరచూ పలువురు ఇక్కడికి వచ్చి వెళుతున్నారని, గుట్టపై ఆలయం ఉన్నదని అది ఎంతో పురాతనమైనదిగా గుర్తించామని తెలిపారు. నగర వాసులు సరదాగా గడిపేందుకు పలు వసతులు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, త్వరలోనే పనులు మొదలు పెడతామని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరం చుట్టూ చెరువులతో పాటు కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను ప్రకృతి ప్రేమికులు గుర్తించి అక్కడికి వెళుతూ దాని గురించి ఇతరులకు పరిచయం చేస్తున్నారు. కొందరు ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్లు సైతం ఇక్కడి నుంచి చుట్టు పక్కల ప్రాంతాల ఫొటోలను తీసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసిన తర్వాత చాలా మంది ప్రకృతి ప్రేమికులు కొహెడ గుట్టను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో వచ్చి గడుపుతున్నారు. కొహెడ గుట్ట పైకి చేరుకున్న తర్వాత అక్కడి బండ రాళ్లను ఎక్కుతూ సరదాగా గడుపుతున్నారు. గుట్టపైనే ఆలయం ఉండటంతో దేవున్ని దర్శించుకుంటున్నారు. గుట్టపైకి వెళ్లేందుకు రోడ్డు మార్గంతో పాటు పలు మౌలిక వసతులు కల్పిస్తే వీకెండ్లోనే కాకుండా ప్రతి రోజు పర్యాటకులు వచ్చే వీలున్నదని పలువురు ఔత్సాహికులు పేర్కొంటున్నారు.