సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి రాబోయే వందేండ్ల పాటు ఏ ఇబ్బందీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మౌలిక వసతులను విస్తరిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 70 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని వచ్చే రెండు మూడేండ్లలో 415 కిలోమీటర్లకు విస్తరించి.. నగరం నలువైపులా ట్రాన్స్‌పోర్టు కనెక్టివిటీని పెంచుతామని తెలిపారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయని..వాటిని పంద్రాగస్టు నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇండ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
ఇండ్లు కట్టుకొని రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న పలు కాలనీల వాసులకు పరిష్కారం చూపుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 118 జీవో కన్వీనియన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటుంటారు.. ఇల్లు కట్టడం ఎంత కష్టమో..పెళ్లి చేయడం కూడా అంతే కష్టమనే భావనలో ఈ మాట అంటుంటారు..కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు మేమే కట్టిస్తున్నాం..పెళ్ల్లి మేమే చేస్తున్నాం’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్లు లక్ష పూర్తయ్యాయని, ఈ ఇండ్లను ఈ నెల 15 నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఇండ్లు పూర్తయినయని, అలాట్మెంట్ చేసుకుని..నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇండ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 118 జీవో కింద నామమాత్రపు ఫీజుతో జారీ చేసిన కన్వీనియన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సాగర్ రోడ్డులో ఉన్న జీఎస్సార్ కన్వెన్షన్ హాల్లో జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా లాభం జరిగే పథకాలు మాత్రమే కాదని..హైదరాబాద్ విస్తరణను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న 50 నుంచి వందేండ్లలో ఎంత అభివృద్ధి జరిగినా సరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో మార్గం, నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం 31 కిలోమీటర్లు కాకుండా మరో 314 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సీఎం కేసీఆర్ అనుమతిచ్చారని గుర్తు చేశారు.
ఓఆర్ఆర్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర మెట్రో రైలును నిర్మించాలని నిర్ణయించామని, ఈ మెట్రో నిర్మాణానికి ఎలాంటి భూసేకరణ పనులు లేకుండా తక్కువ ఖర్చుతోనే ఈ మెట్రో నిర్మాణం చేయొచ్చని తెలిపారు. మనిషి భూమి మీద ఉన్నంత కాలం, బుర్రలో మీటరు తిరుగుతున్నంత కాలం సమస్యలుంటాయి. ఒక సమస్య తీరిన వెంటనే ఇంకో సమస్య వస్తది. అయిపోవు.. కానీ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత కొత్తగా ఎయిమ్స్ తరహా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టి ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రెండు వేల పడకల చొప్పున నగరం నాలుగు వైపులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 33 జిల్లాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీ ఎల్బీనగర్ పక్కనే ఉన్న కందుకూరులో పెట్టబోతున్నాం. భవిష్యత్తులో అది ఎల్బీనగర్ ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఎన్నాళ్లో వేచిన ఉదయం
వనస్థలిపురం, ఆగస్టు 2: సొంత ఇంటిలోనే 16ఏండ్లుగా అభద్రతతో జీవించారు వాళ్లు… కష్టపడి కొన్న ఇళ్లలో పరాయివాళ్లుగా కాలమెళ్లదీశారు. ఆడపిల్లల పెండ్లీలు, ఉన్నత చదువులు, ఇతర అవసరాలకు అమ్ముకోలేని పరిస్థితి. కొత్త ఇళ్లు కట్టుకుందామంటే బ్యాంకులు లోన్లు ఇవ్వని దుస్థితి. ఇది 44 కాలనీల్లో రిజిస్ట్రేషన్ల సమస్య ఎదుర్కొన్న బాధితుల వ్యథ. వారి సమస్యను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఒక్క 118 జీవోతో దశాబ్ధంన్నర సమస్యకు చరమగీతం పాడింది. 4వేల కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పట్టువదలకుండా సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వివరించి 118 జీవోను సాధించారు. నామమాత్రపు ఫీజుతో బాధితులంతా లబ్ధిదారులుగా మారి కన్వీనియన్స్ డీడ్లను అందుకున్నారు. బుధవారం సాగర్ రోడ్‌లోని జీఎస్సార్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటి, పురపాలక మంత్రి కేటీఆర్ నుంచి పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేశం, జోనల్ కమిషనర్ పంకజ, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌ది గొప్ప హృదయం
వనస్థలిపురం, ఆగస్టు 2 : ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని సంపూర్ణంగా పరిష్కరించే గొప్ప హృదయం ఉన్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎల్బీనగర్ సాగర్‌రోడ్‌లో జరిగిన 118 జీవో లబ్ధిదారుల సభలో ఆయన మాట్లాడారు. 2014లో తాను ఎమ్మెల్యేగా లేనప్పుడే మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఆఫీస్‌లో నేరుగా బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అప్పుడే తనకు నమ్మకం ఏర్పడిందన్నారు. ఎల్బీనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు అందించే సహకారం మరువలేనిదన్నారు. తాను బీఆర్ఎస్లో చేరినప్పుడే ప్రజలకు మూడు ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చామన్నారు. రిజిస్ట్రేషన్లు, పండ్ల మార్కెట్ తరలింపు, ఇంటి పన్నులను తగ్గిస్తామని హామీ ఇచ్చామన్నారు. వాటిని నెరవేర్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు.
118 జీవో ద్వారా ఇప్పటికి 4వేల మందికి పత్రాలు అందిస్తున్నామన్నారు. చివరి ప్లాట్ వరకు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. జీవో నెంబర్ 58, 59 ద్వారా ఎల్బీనగర్లో 11, 303 మందికి పట్టాలు అందజేశామన్నారు. ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన పనులు సత్ఫలితాలిస్తున్నాయని, ముంపులేని నియోజకవర్గంగా మార్చగలిగామన్నారు. ఫతుల్లాగూడ శ్మశానవాటిక దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ వే లతో ట్రాఫిక్ సమస్యను అధిగమించామన్నారు. ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్ పేట వరకు మెట్రో రైల్ రానున్నదని, పనామా చౌరస్తాను ఎన్టీఆర్ చౌరస్తాగా నామకరణం చేస్తామని చెప్పారు. గ్రీన్ పార్క్ కాలనీలోని ఎఫ్టీఎల్ సమస్య, శివారు కాలనీలకు డ్రైనేజీ నెట్‌వర్క్‌ను ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ పెద్దమనసుతో సహకరించాలని కోరారు. పని చేసే ప్రభుత్వాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Hyd8
30శాతం లబ్ధిదారులు మావాళ్లే
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
118 జీవో లబ్ధిదారుల్లో 30శాతం మంది తమ నియోజకవర్గానికి చెందిన ప్రజలున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. 118జీవో లబ్ధిదారుల సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోవద్దన్నారు. మరోసారి కేసీఆర్‌ను సీఎం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 118 జీవో లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ఎంతో కష్టపడి కొన్న ఇంట్లో ఇన్నేండ్ల పాటు అభద్రతతో బతికాం. మా ఇంటిపై మాకు హక్కులేదన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా బాధపడేవాళ్లం. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మా సమస్యపై తీవ్రంగా పోరాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో 118జీవో సాధ్యమయ్యింది. ఇప్పుడు ఎంతో ధీమాగా ఉన్నాం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– ప్రమీల, కోపరేటివ్ బ్యాంకు కాలనీ
ఇప్పుడు హక్కుదారులయ్యాం
2007లో ఓ అధికారి చేసిన పొరపాటు.. వేల కుటుంబాలను అగాధంలోకి నెట్టివేసింది. సొంత ఇంటిలో కబ్జాదారులుగా ఉన్నాం. ఎంతమంది అధికారులు సమస్యలు సృష్టించినా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పట్టు వదలలేదు. సమస్య పరిష్కారానికి ఆయన చేసిన కృషి మేము తీర్చుకోలేని రుణం. తమను నామ మాత్రపు రుసుంతో హక్కుదారులుగా మార్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ధన్యవాదాలు.
– పోగుల రాంబాబు, వైదేహినగర్ నార్త్ కాలనీ, బీఎన్‌రెడ్డినగర్
కల నిజమయ్యింది
మా రిజిస్ట్రేషన్ల సమస్య తీరుతుందని అందరూ చెప్పడమే కాలనీ ఏండ్లు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. దీంతో ఆశలు వదులుకున్నాం. ఏం చేయాలో, ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది. మా స్థలాలకు మేము హక్కుదారుగా మారుతామని కలగన్నాం. ఈ రోజు కేటీఆర్ దాన్ని నిజం చేశారు.
-ధనలక్ష్మి, నాగోల్
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిది. కింది నుంచి పై స్థాయి వరకు అధికారులందరినీ ఒప్పించ గలిగారు. అధికారులు బదిలీపై వెళ్తే సమస్య మళ్లీ మొదటికి వచ్చేది. కొత్తగా వచ్చిన అధికారులకు వివరించి ఒప్పించారు. 2018నుంచి మరింత వేగంగా దీనిపై పని చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ఒప్పించడంతో ప్రభుత్వం 118 జీవోను విడుదల చేసింది. అందరం రుణపడి ఉంటాం.
– అమరేందర్‌రెడ్డి, శ్రీకృష్ణదేవరాయ నగర్)
ఏ ఇబ్బందీ రాకుండా..
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్నది. రాబోయే వందేండ్లను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ నగరానికి ఏ ఇబ్బందీ లేకుండా విస్తృతమైన మౌలిక వసతులకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసుకున్నాం. మరో 31 కిలోమీటర్లతో ఎయిర్‌పోర్టు మెట్రో రానున్నది. ఇవి కాకుండా మరో 314 కిలోమీటర్ల నగరం చుట్టూ మెట్రో మార్గానికి మొన్ననే కేబినెట్లో ఆమోదం తెలిపాం. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నుంచి ఇటు నాగోల్‌కు, అటు హయత్ నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో రైలును విస్తరిస్తాం. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దుర్గం చెరువు బ్రిడ్జికి తీసిపోని విధంగా మూసీపై నిర్మించబోయే పద్నాలుగు బ్రిడ్జిలకు త్వరలో శంకుస్థాపన చేస్తాం.
– పురపాలక శాఖ మంత్రి కేటీఆర్