రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు హైదరాబాద్ వేదిక అవనుంది. వచ్చే నెల 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈవో జాయ్ భట్టాచార్య, బేస్‌లైన్ వెంచర్స్ సహవ్యవస్థాపకుడు, ఎండీ తుహిన్ మిశ్రా, బెంగళూరు టొర్పడోస్ సహయజమాని యశ్వంత్ బియ్యాల, ప్రిన్సిపల్ యజమాని అభిషేక్ రెడ్డి, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహయజమాని శ్యామ్ గోపు తదితరులు ఐటీ, అర్బన్ డెవలప్మెంట్ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
మ్యాచ్ బాల్‌ను కేటీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ లీగ్ నిర్వాహకులను అభినందించారు. ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్ అధికారిక మ్యాచ్ బాల్‌ను లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ లీగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు. టోర్నమెంటుకు కావలసిన అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తాం’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అదే సమయంలో వాలీబాల్ లీగ్ సీఈవో జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘అధికారిక మ్యాచ్ బాల్‌ను గౌరవనీయులైన కేటీఆర్‌కు అందించడం మాకు దక్కిన అరుదైన గౌరవం. ఈ టోర్నీ తొలి సీజన్ ప్రారంభంతో దేశంలో వాలీబాల్ క్రేజ్ పెరగడాన్ని కూడా ఈ మ్యాచ్ బాల్ ప్రెజెంటేషన్ సూచిస్తుంది’ అని చెప్పారు.