Minister KTR | ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే నది సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. పరివాహక ప్రాంతాన్ని రమణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకూ చర్యలు చేపట్టింది. పెరుగుతున్న రద్దీతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ- ఈసీలపై రూ. 545 కోట్లతో 14 వంతెనలు నిర్మించాలని సంకల్పించింది. నగర చారిత్రక నేపథ్యానికి ప్రాధాన్యతమిస్తూ.. పారిస్ తరహా బ్రిడ్జిల మాదిరిగా నిర్మించే ఈ వంతెనలు నగర సిగలో మరో ఐకానిక్‌గా నిలువనున్నాయి. టెండర్లు పూర్తయిన ఏడు చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులకు సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు దుర్గం చెరువులో మురుగునీరు చేరకుండా నిర్మించిన 7 ఎంఎల్డీ సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని, దుర్గం చెరువులో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఆయన ప్రారంభిస్తారు. మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేస్తారు. అలాగే నెక్లెస్‌రోడ్‌లో సుమారు 26 కోట్లతో పది ఎకరాల్లో అత్యద్భుతంగా నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కును ఈ నెల 26న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మంచి పర్యాటక కేంద్రంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన పార్కు సైతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. దీంతో ఆ చెరువు పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులో మురుగునీరు చేరి కలుషితం కాకుండా.. జలమండలి ఆధ్వర్యంలో అక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని 7 ఎంఎల్డీ సామర్థ్యంతో పూర్తి చేసింది. ఈ ఎస్టీపీతో పాటు చెరువులో రెండు చోట్ల మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను సోమవారం (నేడు) మంత్రి కేటీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో పాటు చారిత్రక మూసీ, ఈసీలపై ప్యారిస్ తరహాలో గ్రేటర్ నగరంలో హైలెవల్ బ్రిడ్జిల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.545 కోట్లతో మూసీ-ఈసీలపై మొత్తం 55 కిలోమీటర్ల మేర 15 బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే దాదాపు రూ.200 కోట్లతో ఏడు చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా.. ఈ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
మూసీ, ఈసీ నదులపై ఫోర్‌లేన్ బ్రిడ్జిలు
నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్యారిస్ తరహా బ్రిడ్జిల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. మూసీ, ఈసీ నదిపైన 14 వంతెనల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనాతో రెండు సంవత్సరాల పాటు ఎదురైన ఆర్థిక పరిస్థితుల కారణంగా వంతెన నిర్మాణ కార్యాచరణలో జాప్యం చోటు చేసుకున్నది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అధునాతన డిజైన్లతో (బెస్ట్ డిజైన్ ఇన్ ఇండియా) రూపుదిద్దుకోనున్నది. నూతన బ్రిడ్జిల నిర్మాణాలకు డిజైన్లు ఖరారు చేయగా.. 14 చోట్ల పనులను చేపట్టేందుకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, కుడా, హెచ్ఆర్డీసీఎల్ శాఖలు టెండర్లను ఆహ్వానించారు. ఈ మేరకు తొలి విడతలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఏడు చోట్ల వంతెన పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఐదు, జీహెచ్ఎంసీ, హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి కలిపి మొత్తం ఏడు చోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
31 ఎస్టీపీల్లో రెండో ఫలితం
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనుల్లో ఇప్పటికే కోకాపేటలో అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా దుర్గంచెరువు 7 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించిన ఎస్టీపీని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తేస్తారు. మొత్తం మూడు ఫ్యాకేజీల్లో 5 సర్కిళ్లలో 31 ఎస్టీపీల నిర్మాణ పనులను జలమండలిచేపడుతున్నది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్నది. వీటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే.. రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నది.
15 నెలల్లో పనులు పూర్తయ్యేలా..!
ఉప్పల్ భగాయత్ లే అవుట్ వద్ద రూ.42 కోట్లతో, ప్రతాప సింగారం-గౌరెల్లి వద్ద రూ.35 కోట్లతో, మంచిరేవుల వద్ద రూ.39కోట్లతో, బుద్వేల్ ఐటీ పార్కు-2 సమీపంలో ఈసీపై రూ.32 కోట్లతో, బుద్వేల్ ఐటీ పార్కు-1 సమీపంలో ఈసీ నదిపై రూ.20కోట్లతో హెచ్ఎండీఏ వంతెనల నిర్మాణాలు చేపడుతుంది. మూసారాంబాగ్ వద్ద జీహెచ్ఎంసీ, ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ వరకు మూసీ నదిపై హెచ్ఆర్డీసీఎల్ నిర్మాణ పనులు చేపట్టనున్నది. కాగా ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసీపై నాలుగు వరుసల (ఫోర్ లేన్) వంతెన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ఈ ఏడు వంతెనల నిర్మాణ పనులను రాబోయే 15 నెలల్లోగా పూర్తి చేయనున్నారు.
దుర్గం చెరువులో 2 మ్యూజిక్ ఫౌంటెయిన్లు ప్రారంభం
హుస్సేన్‌సాగర్ తరహాలో ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దుర్గంచెరువులో రూ.9 కోట్ల వ్యయంతో 40మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు కలిగిన రెండు మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్లను కేబుల్ బ్రిడ్జికి ఇరు వైపులా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తి కావడంతో సోమవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నాయని తెలిపారు. రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను హెచ్ఎండీఏ నిధులతో ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలు మూడేళ్ల పాటు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తారు. మ్యూజిక్ ఫౌంటెయిన్ల ప్రదర్శన దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుంది.
దుర్గంధం కట్టడికి చర్యలు
నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. దీనికోసం ఆధునిక విదేశీ సాంకేతికను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంద ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశమల్లి, మిల్లింగ్ టోనియా, మైకేలియా చంపాకా (సింహాచలం సంపంగి) మొక్కల్ని నాటారు. ఇవి దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయి.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రులు
మలక్‌పేట, సెప్టెంబర్ 24 : మూసారాంబాగ్‌లోని మూసీ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్, ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్, వాణీదేవి, ఏవీఎన్ రెడ్డి, మిర్జా రహమత్‌బేగ్, మిర్జా రియాజ్ ఉల్ హసన్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బలాల, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి హాజరు కానున్నారని పేర్కొన్నారు.
వందశాతం మురుగు శుద్ధి లక్ష్యంగా..
హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్డీల మురుగునీరు ఉత్పన్నమవుతున్నది. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్డీలుగా ఉంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగునీటిని (46శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎంఎల్డీల మురుగునీటిని శుభ్రం చేయడానికి రూ.3866.41 కోట్ల వ్యయంతో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పన్నమయ్యే మురుగును వీటి ద్వారా శుద్ధి చేస్తారు.
నేడు గ్రేటర్లో మంత్రి కేటీఆర్ షెడ్యూల్
26న నెక్లెస్ రోడ్డులో లేక్ ఫ్రంట్ పార్కు
హుస్సేన్‌సాగర్ తీరంలో హెచ్ఎండీఏ సుమారు రూ.26 కోట్లతో 10 ఎకరాల్లో లేక్ ఫ్రంట్ పార్కును అద్భుతంగా నిర్మించింది. ఈ పార్కును 26న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
26న పాటిగడ్డలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్
బేగంపేట్ పాటిగడ్డలో రూ.6కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు పూర్తికాగా.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. జీ ప్లస్ 2 విధానంలో నిర్మించిన ఈ హాల్‌ను 26వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ప్యారిస్‌లోని బ్రిడ్జిల మాదిరిగా..
కాలుష్యంతో మురికి కూపంగా మారిన మూసీ నదిని సమగ్ర ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకున్నది. చారిత్రక మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఎంఆర్డీసీఎల్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుతో పాటు సుందరీకరణ పనులు చేపట్టాం. అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలను అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో నది పొడవునా ఎలివెటేడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం. ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి ప్రజలకు, వాహన చోదకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ధృడసంకల్పంతో ఉంది. బ్రిడ్జిలు ప్రత్యేకంగా ఉండేందుకు ప్యారిస్‌లోని బ్రిడ్జిలను పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ అధికారుల బృందాన్ని అక్కడకు పంపించారు. అక్కడి సోయినె నదిపై ఉన్న బ్రిడ్జిలను పరిశీలించిన అధికారుల బృందం హైదరాబాద్ నగరంలోని మూసీ కనుగుణంగా ఇక్కడ ఆధునిక బ్రిడ్జిల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మూసీ, ఈసీ నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణదూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.
– డి. సుధీర్‌రెడ్డి, ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే