రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం తథ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని, వాటన్నింటినీ విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం గ్రేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆయన ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు, దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు పాలన వ్యవస్థను తీసుకొస్తున్నట్లు చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 16న వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, ఎమ్మెల్యేల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పాదయాత్రలు చేయాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.
– సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విజయం తథ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కార్పొరేటర్ల సారథ్యంలో తమ తమ వార్డుల్లో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నారు. రానున్న సంవత్సర కాలం పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని, వాటన్నింటినీ విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, సీనియర్ నాయకులు బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌లతో కలిసి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటు పడుతున్న తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ మార్గదర్శనం చేశారు.
ఈ నెల 16న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వార్డు కార్యాలయాల ప్రారంభం చేస్తున్నామని, వీటి ద్వారా నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అందించాలన్న ఉద్ధేశంతో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలను చేపట్టారని తెలిపారు. ఈ ఆలోచన దృక్పథంలోంచి జిల్లాలు, రెవెన్యూ, డివిజన్లు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ఇంటి ముందట నిలిపేందుకు ప్రయత్నం చేశామని వెల్లడించారు. ఇదే వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. 16వ తేదీన జరిగే వార్డు కార్యాలయ ప్రారంభోత్సవాలకు తమ పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వార్డులోని ప్రముఖ వ్యక్తులు, సంఘాలను కలుపుకుపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్పొరేటర్లు ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తూనే పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని, అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. పార్టీ తరఫున నిర్వహించే సమావేశాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతం ద్వారానే మనం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పాదయాత్రలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.