e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home హైదరాబాద్‌ స్వచ్ఛ భాగ్యం

స్వచ్ఛ భాగ్యం

 • అభివృద్ధి పనులకు ఒకేరోజు రూ.5177 కోట్లు విడుదల
 • తాగునీరు, మురుగునీరు శుద్ధి, రోడ్ల నిర్మాణానికి వెచ్చింపు
 • 3866.21 కోట్లతో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణం
 • రూ.1200 కోట్లతో ఔటర్‌ లోపలి
 • గ్రామాలకు భగీరథ నీళ్లు

మహానగర చరిత్రలో కొత్త అధ్యాయం.. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం.. హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం ఒక్కరోజే రూ.5177 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం ఈ మేరకు వేర్వేరు జీవోలను విడుదల చేసింది. నగరాభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను మరోసారి తేటతెల్లం చేసినట్లయ్యింది. మరో 15 ఏండ్ల జనాభాను అంచనా వేసి తాగునీరు, మురుగుశుద్ధి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకున్నా ఔటర్‌ లోపలి 190 గ్రామాల్ల్లో ఈ సమస్య అధికంగా ఉంది.

దీని శాశ్వత నివారణకు జీహెచ్‌ఎంసీ-ఔటర్‌ లోపలున్న ప్రాంతాలకు సమృద్ధిగా 2108 కిలోమీటర్ల తాగునీటి వ్యవస్థ కోసం రూ.1200 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 25 ఎస్టీపీల ద్వారా నిత్యం 77.2 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, అదనంగా మరో 126 కోట్ల లీటర్ల మురుగును శుద్ధి చేసేందుకు నూతనంగా 31 సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3866.21 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీనికితోడు గ్రేటర్‌ చుట్టుపక్కల 17 చోట్ల ప్రారంభించిన ‘డబుల్‌’ ఇండ్ల సముదాయాల్లో అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి రూ.51 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం తెలిపింది.

- Advertisement -

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ మహా నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి వ్యవస్థను విస్తరించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధుల్ని వెచ్చిస్తుంది. మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచినీరు అందుతుండగా… గ్రేటర్‌ పరిధిలో కృష్ణా, గోదావరిజలాల తరలింపు ద్వారా నిండు వేసవిలోనూ కించిత్తు తాగునీటి సమస్య తలెత్తడం లేదు. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ – ఔటర్‌ రింగు రోడ్డు మధ్యలో ఉన్న 190 గ్రామాలకు పట్టణ భగీరథ ద్వారా పుష్కలమైన రక్షిత మంచినీటిని అందించేందుకు తాజాగా మార్గం సుగమమైంది.

ఈ ప్రాంతాల తాగునీటి వ్యవస్థకుగాను గతంలోనే మొదటి విడతగా రూ.756.56 కోట్లతో 7 కోట్ల లీటర్ల సామర్థ్యమున్న 164 రిజర్వాయర్లు నిర్మించింది. ఇందుకుగాను 1600 కిలోమీటర్ల కొత్త పైపులైన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అయితే గత ఆరేడు సంవత్సరాలుగా శివారుల్లో పెద్ద ఎత్తున కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు కొత్తగా వెలిశాయి. ప్రస్తుతం 190 గ్రామాల పరిధిలో జనాభా 20 లక్షల వరకు ఉండగా… 2036 నాటికి 33.92 లక్షల వరకు జనాభా చేరుకుంటుందనే అంచనాతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందుకుగాను 190 గ్రామాల పరిధిలో సమృద్ధిగా నీటిని అందించేందుకు రెండో విడత కింద రూ.1200 కోట్లతో తాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

నాటి గ్రేటర్‌ హైదరాబాద్‌…

2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జీవో ద్వారా హైదరాబాద్‌ నెత్తిన ఒక కిరీటం పెట్టి వదిలేసింది. నగరం చుట్టూ ఉన్న 12 శివారు మున్సిపాలిటీలను హైదరాబాద్‌లో విలీనం చేసి ‘గ్రేటర్‌’ అనే ట్యాగ్‌ పెట్టింది. అంతే తప్ప తెలంగాణ ఏర్పడే నాటికి అంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఏర్పాటు చేసిన ఏడేళ్ల వరకు కూడా శివారులో కనీస వసతులు కల్పించలేదు. దీంతో పేరు గొప్ప…ఊరు దిబ్బ అన్నట్లుగా శివారు ప్రజలు కునారిల్లిపోయారు.

నేటి విశ్వ నగరం..

ఉమ్మడి రాష్ట్రంలో కాగితాలకే పరిమితమైన ‘గ్రేటర్‌ హైదరాబాద్‌’ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే గ్రేటర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రూ.1900కోట్లతో గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో ఏకంగా 2,100 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లతో పుష్కలంగా రక్షిత మంచినీటిని అందిస్తుంది. ఆపై తాజాగా గ్రేటర్‌లోనే కాదు… ఔటర్‌ రింగు రోడ్డు వరకు మహా నగరంలోని మౌలిక వసతుల కల్పనకు ఒకే రోజు రూ.5వేల కోట్లకుపైగా నిధుల్ని మంజూరు చేసి రికార్డు సృష్టించింది.

విశ్వ నగరమంటే మాటలు కాదు… చేతల్లో అంటూ చిత్తశుద్ధిని రుజువు చేసుకుంది. అందుకే హైదరాబాద్‌ మహా నగర చరిత్రలో ఇదో బిగ్‌డే. నగరవాసులకు ఇంత పెద్ద శుభవార్త అందించినందుకు గ్రేటర్‌ ప్రజల తరపున సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కొత్తగా 31 ఎస్‌టీపీలు ఇక మురుగు కష్టాలకు చరమగీతం

సిటీబ్యూరో, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ ) : ఎలాంటి శుద్ధి లేకుండా యథేచ్ఛగా మూసీలో కలుస్తున్న మురుగుకు శాశ్వత మోక్షం లభించనుంది. జలమండలి పరిధిలో ప్రస్తుతం రోజుకు 195 కోట్ల లీటర్లు (జీహెచ్‌ఎంసీ పరిధిలో 165, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 30కోట్ల లీటర్లు)ల మురుగు ఉత్పత్తి అవుతోంది. 2036 సంవత్సరం నాటికి రోజుకు 281.4 కోట్ల లీటర్లు, 2051 సంవత్సరానికి రోజుకు 371.5 కోట్ల లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుందని సీవరేజీ మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనలో ముంబైకి చెందిన షా కన్సల్టెన్సీ ప్రతిపాదించింది.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 31, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 31 ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)లను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 31 ఎస్టీపీలను నిర్మించనున్నారు. 100శాతం సీవరేజీ ట్రీట్‌మెంట్‌ జరిపేందుకుగాను రూ.3866.21 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా 31 ఎస్‌టీపీ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ మున్సిపల్‌ పరిపాలన శాఖ గురువారం జీవో నం.669 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 31 ఎస్టీపీలు ప్రారంభం అయితే సీవరేజీ ట్రీట్‌మెంట్‌లో అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంటుంది.

జీహెచ్‌ఎంసీలోని రోజుకు 165 కోట్ల లీటర్లతోపాటు రానున్న పదేళ్ల మురుగు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 31ఎస్టీపీలకు శ్రీకారం చుట్టింది. ఈ పనులను చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థలు 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులను చెల్లించనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో రోజువారీగా వెలువడుతున్న రోజుకు 165 కోట్ల లీటర్ల మురుగునీటిలో జలమండలి 25ఎస్టీపీల్లో 77.2 కోట్ల లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. అంటే మరో 87.8 కోట్ల లీటర్ల మురుగు నీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 31ఎస్టీపీలను మూడు ప్యాకేజీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మురుగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్‌ పడనుంది.

పనులు.. ప్యాకేజీలు

ప్యాకేజీ -1 (మూసీ ఉత్తరభాగం)40. 25 కోట్ల లీటర్ల మురుగు నీటి శుద్ధికి రూ.1230.21 కోట్ల అంచనా వ్యయంతో 8 ఎస్టీపీల నిర్మాణం (15 ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదే)
ప్యాకేజీ -2 (మూసీ దక్షిణభాగం) 48. 05 కోట్ల లీటర్ల మురుగు నీటి శుద్ధికి రూ.1355.13 కోట్ల అంచనా వ్యయంతో 6 ఎస్టీపీల నిర్మాణం (15 ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదే)
ప్యాకేజీ-3 (కూకట్‌ పల్లి లేక్‌ క్యాచ్‌ మెంట్‌ ) 37.65 కోట్ల లీటర్ల మురుగు నీటి శుద్ధికి రూ.1280.87 కోట్ల అంచనా వ్యయంతో 17 ఎస్టీపీల నిర్మాణం. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు జలమండలి నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకుంది.

అప్రోచ్‌రోడ్లు ఎక్కడెక్కడంటే..

 • సంగారెడ్డి జిల్లా : ఈదుల నాగులపల్లి, అమీన్‌పూర్‌-1, 2, 3
 • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా : బాచుపల్లి సర్వేనెంబరు 186/2, 186/3, తూంకుంట, రాంపల్లి ఫేజ్‌-2,
 • గాగిళ్లాపూర్‌-1 సర్వేనెంబరు 214, బోగారం, జవహర్‌నగర్‌-1,2,3, గాగిళ్లాపూర్‌-2 సర్వేనెంబరు 213
 • రంగారెడ్డి జిల్లా : శంకర్‌పల్లి-1, 2, నార్సింగి, మంఖాల్‌-1, బండరావిర్యాల-1, 2, 3, మొహబత్‌నగర్‌, మల్లాపూర్‌, ఇంజాపూర్‌
 • ఆత్మగౌరవ సౌధాలకు రాచమార్గాలు
 • డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల సముదాయాలకు అప్రోచ్‌ రోడ్లు

17 చోట్ల నిర్మాణానికి రూ.51 కోట్లు మంజూరు

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ) : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా మునుపెన్నడూలేని విధంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాన్ని చేసి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం… మౌలిక వసతుల కల్పనలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 17 చోట్ల నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల సముదాయాలకు ప్రత్యేకంగా అప్రోచ్‌ రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.51 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement