Manne Krishank | సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. అంటే ఇదే మరి. సమస్యలు విస్మరించింది వారే… సమస్యలు ఉన్నాయని అధికారికంగా ధ్రువీకరించింది వాళ్లే.. క్లరికల్ తప్పిదాలు జరిగాయని అంగీకరించింది కూడా వాళ్లే… కానీ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడంటూ ప్రశ్నించిన వ్యక్తిపై కేసులతో ఎదురుదాడి చేస్తున్నారు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ ‘ఫేక్’ కథ అనేక మలుపులు తిరుగుతోంది.
ఉస్మానియా వేదికగా రాష్ట్రంలో కరెంటు, నీటి కొరత ఉన్నాయనే వాస్తవాలు బయటికొచ్చి, రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో దానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై కేసు పెట్టి ఇకముందు ఎవరూ ప్రశ్నించకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ ఫిర్యాదు గందరగోళంగా ఉండటమే నిదర్శనంగా పలువురు చెబుతున్నారు. మరోవైపు తాను జారీ చేసిన నోటీసులో క్లరికల్ తప్పిదాలు ఉన్నాయని చీఫ్ వార్డెన్ అంగీకరించినా… షోకాజ్ నోటీసు జారీ చేసిన రిజిస్ట్రార్ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం కూడా ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌ల్లో కరెంటు కోతలు, నీటి కొరత ఉన్నట్లుగా ఇటీవల చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ జారీ చేసిన నోటీసుల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ బయటపెట్టడంతో హడావుడి చేసిన రాష్ట్ర సర్కారు ఆపై తప్పు మీద తప్పు చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యల్ని తొక్కి పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది నోటీసుల్లోనూ ఇదేరీతిన ఉందంటూ ఎక్స్‌లో ఒక నోటీసును పోస్టు చేశారు. అది ఫేక్ అంటూ విద్యార్థి నాయకుడు నాగేందర్రావు అసలు నోటీసును వెల్లడించడం… దానిని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కూడా ట్వీట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంతవరకు బాగానే ఉంది.. కానీ నాగేందర్రావు, క్రిశాంక్ పోస్టు చేసిన నోటీసునే ఫేక్ అంటూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ ఉస్మానియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదులో స్పష్టంగా.. కొందరు వ్యక్తులు గతేడాది పేరిట వైరల్ చేస్తున్న నోటీసు ఫేక్ అని ఉండాలి. దీంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు చేసిన నోటీసు అసలుదే… కొందరు వ్యక్తులు పోస్టు చేసిన నోటీసునే ఫేక్ అని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనాలి.
కానీ, చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదులో ఇలాంటి వివరాలేవీ లేవు. కేవలం ‘కొందరు వ్యక్తులు ఫేక్ నోటీసును సోషల్ మీడియాలో తిప్పుతూ, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’.. అని మాత్రమే ఉంది. కానీ, ఎక్కడా గత ఏడాది నోటీసు అని పేర్కొనకపోగా.. సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు వ్యతిరేకంగా పోస్టు చేసిన ట్వీట్లను కూడా అందుకు జత చేయలేదు. పైగా, ఎక్కడా ఫలానా వ్యక్తులు అంటూ క్రిశాంక్ పేరు గానీ, ఇతరుల పేర్లు గానీ ఫిర్యాదులో పేర్కొనలేదు. కానీ, రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు క్రిశాంక్, నాగేందర్రావుపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు చేసిన గతేడాది నోటీసు అసలుదని పోలీసులు ధ్రువీకరిస్తున్నారా.? క్రిశాంక్ పోస్టు చేసిన గతేడాది నోటీసు ఫేక్ అని ధ్రువపరుచుకున్నారా.? అసలు ఫలానా వాళ్లు పోస్టు చేసిన గతేడాది నోటీసు ఫేక్ అని చీఫ్ వార్డెన్ ఏమైనా నిర్ధారించారా.?.. ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా క్రిశాంక్‌పై 2011 నుంచి ఉన్న పాత కేసులన్నీ తోడి, ఇప్పుడు జత చేయడమే మరిన్ని అనుమానాలకు ఆస్కారమిస్తున్నది.
రెండు రోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేసిన గతేడాది నోటీసు అసలుదని, విద్యార్థి నాయకుడు నాగేందర్రావు పోస్టు చేసినది ఫేక్ అని చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఆ సందర్భంగా ఆయన తన పరిశీలన వెల్లడించారు. నోటీసుల్లో నోటీసు నంబరుతో సహా అంతా ప్రింట్లోనే ఉంటుంది.. గానీ, పెన్‌తో రాయమని చెప్పారు.
అందుకే నాగేందర్రావు పోస్టు చేసిన దానిలో నంబరు పెన్‌తో వేసినందున అది ఫేక్ అని నిర్ధారించారు. కానీ, కొన్ని గంటల వ్యవధిలోనే అదే తప్పిదాన్ని ఆయన చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ శ్రీనివాస్ ఓయూ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో నంబర్ పెన్‌తో వేసి ఉంది. మరి… నోటీసు నంబరు పెన్‌తో వేస్తే ఫేక్ అయినప్పుడు, శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు కూడా ఫేక్ అవ్వాలి కదా.. అనే విమర్శలు వినిపిస్తున్నాయి.