ఉప్పల్, నవంబర్ 8 : మహిళల భద్రతకు భరోసాతోపాటు, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పేకాట క్లబ్బులు వస్తాయన్నారు. మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. మాటతప్పని సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని.. అక్కా చెల్లెళ్లు ఓ సారి ఆలోచించాలన్నారు. ఉప్పల్ మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్లో బుధవారం ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన మహిళల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మంచినీళ్ల కష్టం తీర్చామని, ఉచితంగా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వాలు అవార్డులు ఇస్తూ, గల్లీలో తిట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని, ఒక్కసారి కాదు 11 సార్లు ఓటేసినా కాని గోస తీరలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీని నమ్మితే ఎండమావులను నమ్మినట్లే, కర్ణాటకలో లాగా ఆగం అవుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరువులేదు.. కర్యూలేదని, కాంగ్రెస్ హయాంలో కత్తిపోట్లు, కర్య్ఫూలతోనే ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజస్తాన్‌లోనే మహిళలకు భద్రత లేదన్నారు. బీఆర్ఎస్ గెలిచిన తరువాత పేదలందరికి బీమాను అందిస్తామని, రేషన్ సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైద్యం మెరుగుపడిందని, పైసా ఖర్చులేకుండా వైద్యం అందిస్తున్నామన్నారు. రాదన్న..కాదన్న తెలంగాణను తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు, పథకాలను అమలు చేయడం పెద్ద విషయం కాదన్నారు. సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకమని తెలిపారు. బీఆర్ఎస్పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఓటేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, ఓటు ఎందుకు వేయాలో తెలియజేస్తూ.. మ్యానిఫెస్టోను రావుల శ్రీధర్‌రెడ్డి ఈ సందర్భంగా మహిళలకు వివరించారు.
ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కూడా దొరకని పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలు గుర్తించాలన్నారు. నాయకులనే మోసం చేసిన రేవంత్‌రెడ్డి, ప్రజలను కూడా మోసం చేస్తారన్నారు. బండారి లక్ష్మారెడ్డి కోసం 20 రోజులు పనిచేయాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ఉప్పల్‌లో గులాబీ జెండా ఎగురవేయాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్, ప్రభుదాస్, బొంతు శ్రీదేవి, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, సింగిరెడ్డి శిరీషారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావనీరెడ్డి, గంధం జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, సాయిజెన్ శేఖర్, కటార్ల భాస్కర్, భాస్కర్, సంతోష్‌రెడ్డి, మహేందర్, మహిళలు పాల్గొన్నారు.
మహిళా సాధికారతతోపాటు, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఉప్పల్ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. మహిళలు అభ్యున్నతి సాధించే విధంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. పేద, మధ్యతరగతి వారికి తన ట్రస్టు ద్వారా విద్య, వైద్యం కోసం తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉద్యమకారులు, మహిళలు ఎన్నికల్లో బండారికి సహకారం అందించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ఉప్పల్‌ను అగ్రగామిగా నిలిపామని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి, బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలన్నారు.