హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పింక్ పవర్ రన్ 2024ను (Pink Power Run) మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్‌ను వైద్య ఆరోగ్యం మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 3కే, 5కే, 10కే రన్‌ను నిర్వహించారు. పింక్ మారథాన్‌లో గెలిచినవారికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి అధికమవుతున్నది. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్‌ను మొదట్లోనే గుర్తించకపోవడం దీనికి కారణమని అని నిపుణులు పేర్కొంటున్నారు. ముందే గుర్తిస్తే సరైన చికిత్సతో మహమ్మారితో పోరాడవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ 2024ను నిర్వహిస్తున్నారు.