సిటీబ్యూరో: నిమ్స్‌లో అత్యవసర విభాగానికి వచ్చే రోగులను నిరీక్షణలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వారిని అడ్మిట్ చేసుకుని, అవసరమైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నిమ్స్ దవాఖానపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్‌కు వస్తున్న రోగుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎమర్జెన్సీ వార్డులో అవసరమైన చికిత్స అందించి, సంబంధిత వార్డుకు రోగులను షిఫ్ట్ చేయాలన్నారు. ప్రభుత్వ దవాఖానల నుంచి లేదా నేరుగా నిమ్స్ ఎమర్జెన్సీకి వచ్చే రోగులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల నుంచి వచ్చే రోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరించి చికిత్స అందించాలని మంత్రి నిమ్స్ అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ల తర్వాత, చికిత్స మధ్యలో రోగులను డిశ్చార్జ్ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప తదితరులు పాల్గొన్నారు.