సిటీ బ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఖాళీ స్థలాలను రెవెన్యూ మార్గాలుగా మలుచుకోవడంపై ఎల్ అండ్ మెట్రో దృష్టి సారించింది. ఈ మేరకు రాయదుర్గం ఐకియా జంక్షన్లో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని భారీ మొత్తానికి లీజుకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నది. అంతర్జాతీయ నిర్మాణ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు 50 ఏండ్ల పాటు రూ. 1020 కోట్లకు అప్పగించేందుకు అంగీకరించింది. సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంచనాలను ఆమాంతం పెంచేలా ఎల్అండ్టీ మెట్రో భూములను అంతర్జాతీయ నిర్మాణ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది.
గతంలో ఈ ప్రాంతంలో ఆఫీస్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా కమర్షియల్ బిల్డింగ్‌ను ఎల్అండ్టీ చేపట్టింది. అయితే నిర్మాణ వ్యయం, పెరుగుతున్న ఖర్చులతో ఆర్థిక భారం కాకుండా ఉండేలా నిర్మాణంలో ఉన్న కమర్షియల్ భవనంతోపాటు, ఖాళీ జాగాలో రెండు భారీ టవర్లు, ఓ మెగా మాల్ నిర్మాణం చేసేలా లీజ్ ఒప్పందం జరిగినట్లుగా తెలిసింది. కాగా గడిచిన రెండేండ్లలో హైదరాబాద్ వేదికగా దాదాపు రూ. 5వేల కోట్ల ల్యాండ్ లీజింగ్ కాగా తాజా ఒప్పందమే పెద్ద డీల్ అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. నిర్వాహణ భారం తగ్గింపు, అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేలా ఎల్అండ్ టీ రూపొందించిన ప్రణాళికను అమలు చేసింది.
సిటీలోనే అతి పెద్ద మాల్…
ప్రస్తుతం 81వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 13 స్టోరేజీ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగా మరో రెండు భారీ టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. దాదాపు 3.8లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ రెండు ఉండగా, ఇప్పటివరకు సిటీలోనే అతిపెద్ద మెగా మాల్ రానుందని తెలిసింది. దీంతోపాటు భారీ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించే అవకాశం ఉంది.
భవిష్యత్ ప్రాజెక్టులపై ఫోకస్…
రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరించాలనే కొంతకాలంగా ఎల్ అండ్ టీ మెట్రో భావిస్తోంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 4వేల కోట్లు పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న భూములను ఆదాయ మార్గాలుగా మార్చితే భవిష్యత్ ప్రాజెక్టులపై ఆర్థిక భారం తగ్గుతోందని, దీంతో ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసే వీలు ఉంటుందని భారీ ల్యాండ్ డీల్‌ను మెట్రో పూర్తి చేసిందని తెలిసింది.