సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): నగరాన్ని ముంచెత్తిన వానతో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓ వైపు జోరు వాన, మరోవైపు కిక్కిరిసిన జనాలతో స్టేషన్లు నిండిపోయాయి. గురువారం సాయంత్రం 5-40 గంటల నుంచి నగరంలో కురిసిన వానలతో నాగోల్ రాయదుర్గం మార్గంలో మెట్రో రాకపోకలు 15 నిమిషాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక సాయంత్రం కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడటంతో అర గంటకు పైగా ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
రాయదుర్గం వద్ద మెట్రో ఒక్కసారిగా ఆగిపోవడంతో నాగోలు-రాయదుర్గం మార్గంలో మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. మెట్రో సేవలకు అంతరాయం లేకుండా సర్వీసులను అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరారు. రాయదుర్గం వద్ద మెట్రో నిలిచిపోవడంతో స్టేషన్లలో ఉన్న రద్దీని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెట్రో నిలిచిపోవడంతో సొంత వాహనాలు, ఇతర మార్గాల్లో ఇండ్లకు చేరుకోనేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చిందని, అయితే అరగంట తర్వాత మెట్రో సర్వీసులు యథావిధిగా రాకపోకలు సాగాయని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి.