Hyderabad Metro | సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఆరేండ్లు దాటింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజూ 5లక్షలకు పైగా నగరవాసులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. 57 కోచ్‌లతో 69 కి.మీ మేర నడుస్తున్న మెట్రో రైళ్లలో కారిడార్-2 (జేబీఎస్-ఎంజీబీఎస్) మినహా మిగతా రెండు కారిడార్లలో రద్దీ అధికంగా ఉంటున్నది. కారిడార్-1(ఎల్బీనగర్-మియాపూర్), కారిడార్-3 ( నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
కనీసం నిలబడేందుకూ చోటు ఉండటం లేదు. లోపలికి ఎక్కిన తర్వాత అటు ఇటు కదలడానికి కూడా అవకాశం లేనంతగా రద్దీ ఉంటున్నది. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా 3 కోచ్‌లు ఉన్న మెట్రో రైళ్ల బోగీలను ఆరుకు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నా ఎల్అండ్టీ పట్టించుకోవడం లేదు. ఏటా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నదే తప్ప.. ఎక్కడా తగ్గడం లేదు. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అయినా అదనపు మెట్రో కోచ్‌ల విషయంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదనపు కోచ్‌ల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. కొత్త కోచ్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చినా.. కొన్ని నెలల సమయం పడుతుంది. గతంలో సౌత్ కొరియా నుంచి కోచ్‌లను తెప్పించగా, అదనపు బోగీల కోసం మళ్లీ అక్కడి నుంచే తెప్పించే ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కాగా, రద్దీగా ఉన్న మెట్రో రైళ్లలోనే ఇరుక్కొని ప్రయాణం చేయాల్సి వస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఫొటోలతో సహా తరచూ పోస్టులు చేస్తున్నారు.
అయినా ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు అదనపు కోచ్‌లను తీసుకురావడంలో ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సైతం ఈ విషయంలో ఎల్‌అండ్‌టీపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే తాము మెట్రో రైళ్లలో ప్రయాణం చేయడం అంటే నిత్యం నరకంగా భావించాల్సి ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెట్రో ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని అదనపు మెట్రో కోచ్‌లను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు.