కుత్బుల్లాపూర్, అక్టోబర్ 1: హైదరాబాద్‌కు మణిహారంగా నిలుస్తూ.. మహానగర ప్రజలకు సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) ఫేజ్-2లో కుత్బుల్లాపూర్‌కు మెట్రో సేవలను విస్తరించాలని కోరుతూ మంగళవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతూ.. దేశంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు సంస్థగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలును మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
దీనిలో భాగంగా మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాలతో పాటు ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్, జీడిమెట్ల, సూరారం, దుండిగల్ ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా గండి మైసమ్మ నుంచి సూరారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్, చింతల్, బాలానగర్ చౌరస్తా మీదుగా భరత్‌నగర్ మెట్రో స్టేషన్ వరకు రూట్- 2లో మేడ్చల్ నుంచి కొంపల్లి సుచిత్ర బోయిన్పల్లి మీదుగా సికింద్రాబాద్‌కు మెట్రో రైలును ఏర్పాటు చేస్తూ నూతన మెట్రో లైన్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఎండీకి వివరించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.