సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నగరంలో కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టు మెట్రో విస్తరణ మూడు ముక్కలాటలా మారింది. ఒక అంశంలో స్పష్టత వచ్చే లోపు మరో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో అసలు విషయం మరిచి లేవత్తిన ప్రశ్నలకు సమాధానాలతో ప్రాజెక్టు అనుమతులు ఆగిపోతున్నాయి.
దీంతో అసలు ప్రాజెక్టును కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుందో తెలయక ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతానికి మెట్రో ఎప్పుడూ వస్తుందో తెలియక జనాలు గందరగోళానికి గురవుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు… మొదట దశ మెట్రో నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్న ఎల్ అండ్ టీ పాత్ర, విస్తరణతో కలిగే ఇబ్బందులు, రెండు వేర్వేరు ప్రాజెక్టుల అనుసంధానం వలన వచ్చే ఆర్థికపరమైన అంశాలను తెరమీదకు తీసుకు రావడంతో అసలు నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ జరుగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలా మారింది. ప్రతిపాదనలతో మొదలై.. కాగితాలకే పరిమితమైతున్న తరుణంలో మెట్రో ఫేజ్-2 మూడు ముక్కలాటలా ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానాలతో తమ గడప దాటేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు అనుమతుల్లో జాప్యం జరుగుతుండగా… హైదరాబాద్ నగరానికి కావాల్సిన ప్రయోజనాలను కోల్పోతుండగా… నగర వాసులకు అధునాతన రవాణా వ్యవస్థ కలగానే మారిపోతుంది.
రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు హడావుడిగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపి కాంగ్రెస్ చేతులు దులుపుకోగా, ప్రతిపాదనల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ కేంద్రం దోబుచూలాడుతుండగా… ప్రస్తుతం నగరంలో మొదట దశ మెట్రో మార్గాన్ని నిర్వహిస్తున్న ఎల్ అండ్ డీ సంస్థను విస్తరణ ప్రాజెక్టుకు కలిగే ఇబ్బందులను లేవనెత్తుతూ ప్రాజెక్టులను పరిశీలిస్తుస్తోంది. ఈ పరిశీలన క్రమంలో కేంద్రం లేవనెత్తే అంశాలకు స్పష్టత వస్తే గానీ ప్రాజెక్టుకు ఆమోదం కలిగేలా లేదు.
జాప్యమెందుకు..?
రెండో దశ మెట్రో విస్తరణ ప్రాజెక్టు జాప్యానికి ప్రధాన కారణాల్లో అసంబంధమైన మార్గాలను చేర్చడమేనని పెద్ద చర్చ నడుస్తోంది. జనసంచారమే లేని ఫోర్త్ సిటీ ప్రాంతాలకు మెట్రో ప్రత్యేక కారిడార్‌గా ప్రకటించడం ద్వారా నగరంలో కీలకమైన ప్రాంతాల్లో వాస్తవ అవసరాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన ఏడేళ్ల కాలంగా నార్త్ సిటీ ప్రాంతానికి మెట్రో విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడు ఆ దిశగా కేంద్రం సహకరించలేదు. శరవేగంగా విస్తరిస్తున్న నగర శివారులకు మెట్రో విస్తరణ ప్రతిపాదనలను గత ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఏనాడూ ప్రాజెక్టు తీవ్రతను అర్థం చేసుకుని ఆపన్న హస్తం అందించలేదు.
అయినా నగరంలో మెట్రో విస్తరణను సొంత నిధులతో చేపట్టేందుకు బీఆర్ఎస్ సర్కారు చేసి, టెండర్లు కూడా ఖరారు చేసింది. అందులో భాగంగా వచ్చినదే ఎయిర్‌పోర్టు మెట్రో. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రతిపాదన నగర రవాణా వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌గా మారేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే టెండర్లు ఖరారు చేసిన ప్రాజెక్టును రద్దు చేసి అవసరం లేని ప్రాంతాలను విస్తరణ జాబితాలో చేర్చడంతో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం కొర్రీలు పెడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
కొత్తగా ప్రస్తుతం ఎల్అండ్టీ సంస్థ ప్రమేయాన్ని కూడా కేంద్రంపరిశీలిస్తుండటంతో.. మెట్రో విస్తరణలో ఆ సంస్థ సహకారం కీలకంగామారే పరిస్థితులు వస్తున్నాయి. ఒకవేళ మెట్రోవిస్తరణకు అనుమతులు ఇచ్చినా.. ఈ సంస్థ సహకారం లేకుండా ప్రాజెక్టును నిర్వహించే వీలు కనిపించకపోవడంతోనే కేంద్రంకూడా ఎల్అండ్టీ పాత్రను ప్రస్తావించినట్లుగాసమాచారం. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర సర్కార్ల మధ్య ప్రాజెక్టు అనుమతుల్లో జాప్యంతో మెట్రో ఫేజ్ -2 పనులపై స్పష్టత కరువైంది