సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : నగరంలో మెట్రో విస్తరణ పేరిట రూపొందించిన డీపీఆర్‌కు ఏడాది దాటింది. కానీ ఈ ఏడాది కాలంలో ఢిల్లీ గడప దాటని కాంగ్రెస్ ప్రతిపాదనలతో నగరంలో మెట్రో విస్తరణ అంశమే హాస్యాస్పదంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెట్రో విస్తరణ పేరిట ఉన్న ప్రాజెక్టును రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి… పట్టాలెక్కిన రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రోను కనుమరుగు చేశారు. ఇక రెండో దశ విస్తరణ కోసం ఏడాది కిందటే పార్ట్ ఏ, పార్ట్-బీలుగా డీపీఆర్‌ను సర్కారు విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు ఇందులో ఏ ఒక్క కారిడార్‌కు పునాది పడలేదు. పెండింగ్‌లో ఉన్న ఓల్డ్ సిటీ మెట్రోకు మరోసారి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, కనీసం ఆ ప్రాజెక్టునైనా పట్టాలెక్కించారంటే కనీసం భూ సేకరణ పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతున్నారు.
గతేడాది నవంబర్ నెలలో డీపీఆర్ కేంద్రానికి చేరగా… ఇప్పటివరకు హైద్రాబాద్ మెట్రో ప్రతిపాదనలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 48 శాతం మేర జైకా, ఏడీబీ, ఎన్డీబీ(మల్టీ లెటరల్) వంటి .. ఆర్థిక సంస్థలతో ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం 7313 కోట్లు (30శాతం), కేంద్ర వాటా రూ. 4230 కోట్లు(18శాతం) మేర చేపట్టనుంది. అయితే ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలని డీపీఆర్‌లో పొందుపరిచారు.
మిగిలిన 4 శాతం మేర రూ. 1033 కోట్లను పీపీపీ విధానంలో సమకూర్చి ప్రాజెక్టును చేపట్టేలా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును హైదరాబాద్ మెట్రో సంస్థ తయారు చేసింది. రెండో దశలో ఆరు కారిడార్లలో 116.4 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నట్లు చెప్పారు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఆరో కారిడార్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్లు, నార్త్ సిటీకి మరో 44 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు ప్రతిపాదనలను రూపొందించగా, ఇప్పటికీ కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలను దాటి పట్టాలెక్కడం లేదు. ఇప్పటికీ ప్రకటించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కార్యరూపంలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. కనీసం శంకుస్థాపన చేసి, డీపీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా నిర్మించడంలో విఫలం అవుతుంది. దీంతోనే ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకంగా మారుతుండగా, ఎదురుచూపులు అనివార్యంగా మారాయి. రెండేండ్ల రేవంత్‌రెడ్డి పాలనలో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు విజయవంతంగా నిర్మాణ పనులు మొదలైన దాఖాల్లేవు. ఇక చేపట్టిన ప్రతి ప్రాజెక్టును కూడా భూసేకరణ వివాదాలతోనే పక్కన పడుతున్నాయి.