Hyderabad Metro | సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డును దాటి హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో నగరం నలుదిక్కులా అభివృద్ధికి నోచుకున్నది. దాని ఫలితంగానే నివాస గృహాలతో పాటు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు అన్ని వైపులా ఏర్పాటయ్యాయి. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశను ప్రతిపాదించి డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు రూపొందించినా, అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి.
ప్రధానంగా వెస్ట్, సౌత్, ఈస్ట్ హైదరాబాద్ల వైపు కొన్ని మార్గాలను ప్రతిపాదించినా, నార్త్ (ఉత్తర) హైదరాబాద్ వైపు మాత్రం ఒక్క మార్గాన్ని కూడా రెండో దశలో ప్రతిపాదించలేదు. దీనిపై గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల వాసులంతా ఒక్కటై ఆందోళనకు సిద్ధం కాగా, వారికి ప్రజాప్రతినిధులు సైతం మద్దతుగా నిలిచారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రెండో దశ మెట్రోకు సంబంధించిన 5 మార్గాల్లో సుమారు 76.2 కి.మీ మేర మెట్రోను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు డీపీఆర్లను సమర్పించారు.
కొత్త మార్గాలపై అధ్యయనం…
మెట్రో రెండో దశ మార్గాలు ఖరారైనా, నగరంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు మెట్రోను నిర్మించాలన్న డిమాండ్ బాగా పెరగడంతో వాటిని తరువాత దశలో చేపట్టే దిశగా అధ్యయనం చేపట్టనున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు ఉన్న వివిధ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు ఆయా మార్గాలను పరిశీలించనున్నారు.
ఇందులో ప్రధానంగా తార్నాక-ఈసీఐఎల్-కీసర, సికింద్రాబాద్ ప్యాట్నీ-అల్వాల్ మీదుగా శామీర్పేట, సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి మీదుగా మేడ్చల్ కండ్లకోయ వరకు ఉన్న మార్గాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరిస్తున్న నేపథ్యంలో కోర్ సిటీ నుంచి నగరం నలుమూలలా మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ అధ్యయనాన్ని చేపట్టనున్నట్టు తెలిసింది.