Adibhatla | ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని రాగన్నగూడకు తరలించొద్దని శనివారం ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు గోపాల్‌గౌడ్, రజినీకాంత్‌గౌడ్, శేఖర్, శ్రీశైలం, శ్రీనివాస్, శివ తదితరులు మాట్లాడుతూ.. ఆదిబట్లను సర్కిల్‌గా ఏర్పా టు చేసిన ప్రభుత్వం.. రాత్రికి రాత్రే ఆ కార్యాలయాన్ని రాగన్నగూడకు తరలించడం దారుణమని మండిపడ్డారు. ఎవరి స్వలాభం కోసం సర్కిల్ కార్యాలయాన్ని రాగన్నగూడకు తరలించారని అధికారులను ప్రశ్నించారు. సర్కిల్ కార్యాలయాన్ని ఆదిబట్లలోనే ఉంచా లని.. లేనిచో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో జమ్మ రాజు, బాబు పాల్గొన్నారు.
– ఆదిబట్ల
రంగారెడ్డి, జనవరి 3 (నమస్తేతెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో శివారు మున్సిపాలిటీల విలీనం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మున్సిపాలిటీల విలీనం అనంతరం సర్కిల్ కార్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీ మధ్య చిచ్చు రాజేసినట్లయ్యింది. ముందుగా ప్రభుత్వం తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను కలిపి, ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఏకపక్షంగా చేశారంటూ తుర్కయంజాల్, తొర్రూరు వార్డుల ప్రజలు కొంతకాలంగా ఆందోళన చేపడుతున్నారు. లక్ష ఓట్లున్న తుర్కయంజాల్, తొర్రూరు వార్డులు, 17వేల ఓట్లున్న ఆదిబట్ల, కొంగర మున్సిపాలిటీలో కలిపి ఆదిబట్లలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చి ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఎత్తివేసి తుర్కయంజాల్ వార్డులోని రాగన్నగూడలో ఏర్పాటు చేశారు. ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని తొలగించి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో తుర్కయంజాల్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తుర్కయంజాల్ వార్డుల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని అధికారులు ఖాళీ చేసి రాగన్నగూడ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
దీంతో శనివారం కొంగర, ఆదిబట్ల వార్డు కార్యాలయాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో తుర్కయంజాల్, ఆదిబట్ల మధ్య సర్కిల్ కార్యాలయం ఏర్పాటు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి ఉంది. ఆదిబట్లను సర్కిల్ కార్యాలయంగా ప్రకటించిన ప్రభుత్వం.. మళ్లీ రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి సర్కిల్ కార్యాలయాన్ని తుర్కయంజాల్ వార్డు పరిధిలోని రాగన్నగూడకు తరలించటమేమిటని ఆదిబట్ల, కొంగరకలాన్ వార్డు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని కొనసాగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల కార్పోరేషన్లను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసిన ప్రభుత్వం సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు అస్తవ్యస్తంగా చేసిందని ఆరోపణలున్నాయి. సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు విషయంలో జనాభా ప్రాతిపాదికన పరిగణిలోకి తీసుకోలేదని, ఏకపక్షంగా ఏర్పాటు చేశారని పలువురు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలోని రెండు వార్డులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలపటాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రెండు వార్డులను సర్కిల్ కార్యాలయంలో కలపడంపై ప్రజాభిప్రాయం తీసుకోలేదని ఆరోపణలున్నాయి. అలాగే, తుక్కుగూడ, పహాడీషరీఫ్, బండ్లగూడజాగీర్, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి మున్సిపాలిటీలకు సంబంధించి సర్కిళ్ల ఏర్పాటు కూడా సరిగ్గా జరగలేదని ప్రజలు వాపోతున్నారు.
సర్కిల్ కార్యాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం పూటకో నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నిన్నటి వరకు ఆదిబట్ల సర్కిల్‌ను కొనసాగించారు. రాత్రికి రాత్రే ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని తొలగించి తుర్కయంజాల్ను సర్కిల్ కార్యాలయంగా ఏర్పాటు చేయడం వల్ల ఈ రెండు మున్సిపాలిటీల్లో గందరగోల పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో రెండు మున్సిపాలిటీలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాన్నే సర్కిల్ కార్యాలయంగా కొనసాగించాలని పట్టుబడుతున్నారు.