హయత్‌నగర్, డిసెంబర్ 3 : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ వ్యాపారి దారు ణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అర్ధవీడు మండలం, దోనకొండ గ్రామానికి చెందిన యక్కలి కాశీరావు(37), భార్య సుమలత, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్ డివిజన్లోని అరుణోదయ కాలనీలో నివాసముంటున్నారు. కాశీరావు కార్లు క్రయ, విక్రయాలు చేస్తుంటాడు. వీరు నివాసముండే ఇంటి మొదటి అంతస్తులో రెండేళ్లుగా పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి, ఐతరాజు శంకర్లు అద్దెకు ఉంటున్నారు.
వీరిలో సాయి, శంకర్లు హయత్‌నగర్‌లోని బొమ్మలగుడి వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. పెద్దగాని శేఖర్.. కాశీరావుతో కలిసి కార్లు క్రయ, విక్రయాలు చేస్తున్నారు. అయితే.. కాశీరావు వద్ద శేఖర్ 2023, మేలో రూ. 3.60 లక్షలు, జూన్‌లో రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం శేఖర్ ఒక్కడే రూంలో ఉండగా కాశీరావు డబ్బులు అడగ డానికి వెళ్లాడు. వారిద్దరి మధ్య గొడవ జరగడంతో శేఖర్.. కాశీరావును చంపేసి.. అతడి భార్య సుమలతకు చెప్పాడు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్, సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.