బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 4 : సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న బన్సీలాల్‌పేట్ డివిజన్లోని మేకలమండి పాఠశాలను వచ్చే ఏడాది హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తామని, 10వ తరగతి వరకు విద్యాబోధన అందిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, టీఎస్‌ఈఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కె.హేమలత, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీఈఓ రోహిణి, బీఆర్ఎస్ ఇన్చార్జి జి.పవన్‌కుమార్ గౌడ్లతో కలిసి రూ.1.84 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి భూమి పూజ, రూ.33 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలను మెరుగుపరిచామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఫలితంగా విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని అన్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, రోజుకి రెండు సార్లు రాగిజావ విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు.
కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా..
పేద మధ్యతరగతి ప్రజలు నివసించే భోలక్‌పూర్ ప్రాంతంలో 2011లో ప్రాథమిక పాఠశాలగా మొదలైన మేకలమండి స్కూల్‌ను 2020లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా విద్యాబోధన అందిస్తున్న ఈ డిజిటల్ స్కూల్లో ప్రస్తుతం 750 మంది విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉత్తమమైన విద్యను అందిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచిన ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం.మల్లికార్జున్‌రెడ్డి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. జోరువానలోనూ సంబురంగా కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖధికారి ఎస్.చిరంజీవి, డిప్యూటీ ఐఓఎస్ కస్తూరి, ఉన్నత పాఠశాల సాధన కమిటీ సభ్యులు ఈ.చంద్రశేఖర్, బి.నర్సింగ్‌రావు, వీజే.శేషగిరిరావు, ఆర్.రాజు, నాయకులు ఏసూరి మహేశ్, వెంకటేశన్ రాజు, మహేందర్, రాజేందర్, లక్ష్మిపతి, వెంకట్, బాబు, కేఎం.కృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, నాగలక్ష్మి, అంబిక, అమృత, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు
ఉన్నత పాఠశాల భవనం నిర్మాణానికి మంత్రి సబితారెడ్డి రూ.1.84 కోట్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రూ.25 లక్షలు, నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి మంత్రి తలసాని రూ.7.70 లక్షలు కేటాయించినందుకు హెచ్ఎం.మల్లికార్జున్‌రెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.