Hyderabad | హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అత్తాపూర్‌లో మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అమిష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి బయటకు వెళ్లేప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య గొడవ జరిగింది. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.
ఫ్యాన్‌కు వేలాడుతున్న పింకీ శర్మను చూడగానే కంగారుపడిపోయిన అమిష్.. వెంటనే పక్కింటి వాళ్లను పిలిచాడు. పక్కింటి వాళ్ల సాయంతో పింకీని కిందకు దించి ఆస్పత్రికి తరలించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే పింకీ శర్మ మరణించిందని వైద్యులు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే పింకీ శర్మ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.