మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): అత్యుత్తమ వైద్య సేవలకు పెట్టింది పేరు.. గత ప్రభుత్వం. ప్రజారోగ్య పరిరక్షణలో గత ప్రభుత్వ సేవలు అమోఘం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజా సేవలపై, ఆరోగ్య వ్యవస్థపై, పాలనా తీరుపై సరైన అవగాహన లేక ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు కొరవడ్డాయి. ప్రభుత్వ పని తీరును గమనించిన ప్రజలు విసిగి వేసారి ప్రైవేట్ ఆసుత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ దవాఖానలున్నా వైద్యులు, సిబ్బంది, సబ్ పోస్ట్‌ల సిబ్బంది కొరతతో పాటు ప్రస్తుతం మందుల కొరత ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో 26 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 12 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు,70 పల్లె దవాఖానలు, 112 బస్తీ దవాఖానలు ఉండగా, వైద్యులు, సిబ్బంది కొరత మూలంగా ప్రజలు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 35 వైద్యులు, 32 ల్యాబ్ టెక్నిషియన్లు, 130 నర్సులు పోస్టుల ఖాళీలతో పాటు సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో లేక పోవడం మూలంగా వైద్య సేవలందక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని వివిధ పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానాలలో పర్యవేక్షణ కొరవడటంతో వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది సరైన వేళలకు రాకపోవడంతో వైద్య సేవలకు వచ్చే రోగులకు ఇబ్బందికరంగా మారింది. సాధారణ జబ్బులు, జర్వం, దగ్గు, ఒళ్లు నొప్పులకు సంబంధించిన మందులు అడపాదడపా లభించినప్పటికి సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. 24 గంటల రౌండ్క్లాక్ దవాఖానాలలో ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 24 గంటలు వైద్య సేవలందించే 12 ప్రభుత్వ దవాఖానలు ఉండగా, ఇందులో నాలుగు దవాఖనాలలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్, శామీర్‌పేట్ దవాఖనలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ సరిపడా వసతులు కల్పించలేదు. ప్రభుత్వ దవాఖానలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టక పోవడంతో వైద్య రంగ వ్యవస్థ చిన్నా భిన్నమైంది.