సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో పాలన గాడితప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో కిందిస్థాయి ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. బ్లడ్ బ్యాంక్‌లో నుంచి బ్లడ్ ప్యాకెట్లు మాయమైన ఉదంతంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక రాకముందే తాజాగా మందుల చోరీ వెలుగులోకి రావడం గమనార్హం. దవాఖాన వర్గాలు, విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం…నిలోఫర్ దవాఖానలో ఓ మహిళ తన తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరి, లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నది.
దవాఖానలోని మరికొందరు ఉద్యోగుల సహకారంతో ఖరీదైన మందులు, ఇంజక్షన్లు, ఇతర క్లినికల్ సామగ్రి వంటి వాటిని తస్కరించి సంచుల్లో భద్రపరుస్తుంది. ఆయా మందుల కొరత ఏర్పడటంతో దవాఖాన సిబ్బంది వైద్యులు రాసిన మందులను బయట నుంచి తెచ్చుకోవాలని సూచిస్తారు. అప్పటికప్పుడు ఆ మందులు ఎక్కడ దొరుకుతాయో వాకబు చేసే లోపే విషయాన్ని గమనించి, తాను తెప్పించి ఇస్తానంటూ రోగి సహాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి తస్కరించిన మందులను వారికి అందజేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
చిన్నారులు, గర్భవతులకు అత్యవసర సమయంలో అందించాల్సిన రక్తాన్ని అర్ధరాత్రి సమయంలో దవాఖానలోని బ్లడ్ బ్యాంక్ నుంచి బయటకు దాటించిన ఘటన వ్యవహారం మరవకముందే మందుల భాగోతం బయటకు రావడం కలకలం రేపింది. సాధారణంగా మందులకు సంబంధించిన ఇండెంట్‌ను ఎప్పటికప్పుడు సంబంధిత నర్సింగ్ అధికారులు, ఆర్‌ఎంఒలు, వైద్యాధికారులు సరిచూసుకోవాల్సి ఉంటుంది. కాని పెద్ద మొత్తంలో మందులు మాయమవుతున్నా ఇప్పటి వరకు సమాచారం బయటకు రాలేదంటే ఈ చోరీ వ్యవహారంలో మరికొంత మంది సిబ్బంది హస్తం కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 22న రాత్రి మందులను తస్కరించిన లిఫ్ట్ ఆపరేటర్‌ను దవాఖానలో ఉన్న స్పెషల్ పోలీసులు పట్టుకుని, దవాఖాన అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో దవాఖాన అధికారులు మీనామేశాలు లెక్కించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాలతో సూపరింటెండెంట్ ద్వారా ఫిర్యాదు ఇప్పించాలని పోలీసులు చెప్పడంతో ఎట్టకేలకు దవాఖాన అధికారులు గురువారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి పోలీసులు వెల్లడించారు. కాగా ఎఫ్ఐఆర్ కాపీ తనకు ఇంకా రాలేదని, వచ్చిన తరువాత మందుల దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ దవాఖాన సూపరింటెండెంట్ కేసు వివరాలు వెల్లడించకుండా దాటవేయడం గమనార్హం.