Hyderabad | సిటీబ్యూరో, మార్చి27, (నమస్తే తెలంగాణ): ప్రస్తుత సమాజంలో తెల్లకోటు దొంగలు అధికమవుతున్నారు. కనీస అర్హత లేకున్నా నాడీ పట్టి కాసులు గుంజుతుండ్రు. ప్రస్తుత రోజుల్లో వైద్యం మరింత ఫిరం కావడంతో వృత్తిపేరు చెప్పుకొని నకిలీ దందాకు తెరలేపారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వరుస దాడులు చేసినా, కేసులు పెట్టినా బెదరకుండా దాందా సాగిస్తూ, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఎన్ఎంసీ అనుమతిస్తేనే…
ఇటీవల కాలంలో హైదరాబాద్ ప్రాంతంలోని జీడిమెట్ల, మియాపూర్, దుండిగల్, ఎల్బీనగర్, సరూర్నగర్, రామంతాపూర్, బీరప్పగూడ, ఉప్పల్, చింతల్, షాపూర్, ఐడీపీఎల్ మొదలైన ప్రాంతాల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు నిర్వహించి నకిలీ వైద్యులను గుర్తించి కేసులు పెట్టారు. కేవలం ఫిబ్రవరి నెలలోనే జీడిమెట్ల, మియాపూర్ ప్రాంతాల్లోనే 10మంది నకిలీ వైద్యులపై కేసులు పెట్టారు. వీళ్లంతా కూడా ఫేక్ ధ్రువపత్రాలతో అర్హత లేని చదువులతో వైద్య రంగంలోకి ప్రవేశించారు.
వాస్తవానికి మనదేశంలో వైద్యసేవలందించాలంటే కచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కచ్చితంగా వైద్యుడుకాదలచినవారు ఎన్ఎంసీ గుర్తింపు పొందిన మెడికల్ కళాశాలనుంచి ఎంబీబీఎస్ పూర్తిచేయాలి. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారంతా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
ఆ తరువాత ఏడాది పాటు కండీషనల్ ఇంటర్న్షిప్ తప్పనిసరిగా చేయాలి. ఎన్ఎంసీ లేదా ఎస్ఎంసీలో ప్రాక్టిస్ చేయాలంటే రిజిస్టేష్రన్( డీఆర్ఎన్) తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే ప్రజలకు వైద్యం అందిచేందుకు అర్హత లభిస్తుంది. కానీ అవేవి పట్టించుకోవకుండా ప్రస్తుతం ఎవరు పడితే వారే డాక్టర్లమంటూ చెప్పుకు తిరుగుతూ నకిలీవైద్యమందిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ జాబితాలో సుమారు 50,000 మంది వైద్యులు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. బయట మాత్రం గల్లీకో ఆసుపత్రి మనకు దర్శనమిస్తుండటం గమనార్హం.
చర్యల్లో వేగం పెంచాలి..
నకిలీ వైద్యుల కట్టడిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. సామాన్యులు ఫిర్యాదులు చేస్తే తప్ప మెడికల్ కౌన్సిల్ దాడులు నిర్వహించడంలేదనే వాదన వినిపిస్తుంది. కేసులు పెట్టినా, చాలా ప్రాంతాల్లో దొంగ చాటు వైద్యసేవలు సాగుతూనే ఉన్నాయి. మెడికల్ కౌన్సిల్ గత కొన్నినెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది నకిలీ వైద్యులను గుర్తించి కేసులు పెట్టింది. ఇందులో అధికశాతం మంది రాజధాని సమీప ప్రాంతాల్లోనే ఉంటున్నారు.
వీరు వైద్యం చేయడమేకాకుండా పేరుమోసిన పలు కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆ ఆసుత్రులిచ్చే కమీషన్లు తీసుకుంటూ వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. ఈ లెక్కప్రకారం కంటికి కనబడకుండా అర్హతలేని నకిలీలు ఎంతమంది ఉన్నారో చెప్పనక్కరలేదు. మెడికల్ కౌన్సిల్ దృష్టిసారించి చర్యలు వేగవంతం చేస్తేనే నాణ్యమైన వైద్యం సామాన్యులకు అందించిన వారవుతారు.