బాలానగర్, జూన్ 2 : బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజుల క్రితం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రసవానికి వచ్చిన అరుణ అనే గర్భవతి ప్రసవానంతరం మృతి చెందిన ఘటనలో … మృతికి గల కారణాలను మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంఆండ్హెచ్ఓ శోభారాణి, వైద్య సిబ్బందిని మృతురాలి బంధువులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ.. గర్భవతికి ప్రసవం చేసి పంపాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్టాఫ్ నర్సు తనకు ఇంట్లో పని ఉందని చెప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వెళ్లిపోవడం అత్యంత దారుణమని అన్నారు. స్టాఫ్ నర్సు అక్కడే ఉండి తగిన వైద్య సేవలు అందించి ఉంటే అరుణ మృతి చెంది ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరుణ మృతికి కారణమైన వారిని సస్పెండ్ చేయాలని కోరారు.
స్టాఫ్ నర్సు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన అరుణ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందించే విధంగా చూడాలని డీఎంహెచ్వో శోభారాణిని ఎమ్మెల్యే మాధవరం కోరారు.
లేనిపక్షంలో బాధిత కుటుంబంతో కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదే కేంద్రంలో నెలకు 100కు పైగా ప్రసవాలు జరిగేవని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Madhavaram Krishna Rao
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్లు అందజేసి తల్లీబిడ్డల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని తెలిపారు. కూకట్పల్లిలో ప్రభుత్వ దవాఖానల విస్తరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించినా భవన నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మేడ్చల్ జిల్లా కలెక్టర్కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని వెల్లడించారు.
తన బిడ్డకు ప్రసవం చేయించి తల్లీ బిడ్డలను సంతోషంగా చూసుకుంటానని భావించి బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి తప్పు చేశానని అరుణ తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దవాఖానకు తీసుకురాకుండా ఉంటే తన బిడ్డ బతికి ఉండేదని చెప్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం చేసేందుకు స్టాఫ్ నర్సు సరిగ్గా స్పందించలేదని తెలిపింది. వారి నిర్లక్ష్యం వల్లే తన కూతురు, మనవడు తనకు శాశ్వతంగా దూరమయ్యారని కన్నీరుమున్నీరుగా విలపించింది.