సిటీబ్యూరో, జూలై 2, (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో విచ్చలవిడిగా సాగుతున్న ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కరువైంది. వైద్యాధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేసినా కూడా భయమన్నది లేకుండా ఇష్టానుసారంగా స్కానింగ్ దందా సాగుతున్నది. అనుమతులు లేకుండానే చట్టరీత్యా నేరంగా పరిగణించే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి పట్టుకునే లోపే ముందస్తు సమాచారంతో జాగ్రత్తలు పడుతున్నారు.
గ్రేటర్ పరిధిలో 3000కు పైగా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో సగానికిపైగా నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తుండటం గమనార్హం. ప్రభుత్వాసుత్రుల్లో లింగ నిర్ధారణ నేరమని తెలిసి, అనేకమంది ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అధిక మొత్తంలో సొమ్మును ఇచ్చి తమకు పుట్టబోయేది ఆడా?మగా? అనే విషయాలు ముందే తెలుసుకుంటున్నారు. గర్భదారణ, గర్భాంతర దశలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 ను తుంగలో తొక్కుతూ, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అధిక సొమ్ముకు ఆశపడి చట్టవ్యతిరేకమైనా కూడా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. గ్రేటర్ పరిధిలో డెకాయ్ ఆపరేషన్ జరిగిన దాఖలాలు చాలా అరుదు. వైద్యాధికారులు పలుసార్లు అనుమానం ఉన్న పలు కేంద్రాల్లో తనిఖీలకు వెళ్లేసరికే తనిఖీలు నిర్వహించే వారిలో ఎవరో ఒకరు ముందస్తు ఇచ్చిన సమాచారంతో ఆయా సెంటర్లవాళ్లు అలర్ట్ అవుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు ఏడాది కాలంగా 22 స్కానింగ్ కేంద్రాలను మాత్రమే సీజ్ చేసినట్లు సమాచారం. వాటిలో కొన్నింటికి జరిమానా విధించడంతోనే సరిపెట్టారు.
స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు జిల్లా వైద్యాధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకొని ఉండాలి. ఆ మిషన్లను ఒక సెంటర్ నుంచి మరో సెంటర్కు మార్చినా, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చినా కూడా వైద్యశాఖను సంప్రదించాలి. క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. కాలంచెల్లిన స్కానింగ్ యంత్రాలను తిరిగి ఆ కంపెనీలకు అప్పజెప్పకుండా వాటినే ఉపయోగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా స్కానింగ్ పరీక్షలు చేస్తుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కానింగ్ సెంటర్లలో సాగానికి పైగా గ్రేటర్లోనే ఉంటాయి.
వైద్యాధికారులు చూసీచూడనట్లు వదిలేయడం, తమ దృష్టికి వచ్చినవాటినే సీజ్ చేయడం కారణంగా అనేకమంది గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పాడైన స్కానింగ్ యంత్రాలతో పరీక్షలు చేయించుకన్నామని తెలియక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న రోగాన్ని లేనట్లు, లేని రోగాన్ని ఉన్నట్లు చూయించడంలో స్కానింగ్ పరీక్షలదే పై చేయి. వాటి వల్ల పలుసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం సైతం పొంచి ఉంది. ఇప్పటికైనా వైద్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్లు చేస్తూ, చట్టరీత్యా నేరమైన లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సెంటర్లపై చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు.