హిమాయత్‌నగర్, ఆగస్టు 28: అతివేగం.. ఓ మహిళ ప్రాణం తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పారిశుధ్య కార్మికురాలిని ఓ మెడికల్ కాలేజీ బస్సు మృత్యువు రూపంలో కబళించింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రాంనగర్‌లోని పార్సిగుట్టకు చెందిన గోవర్ధన్, సునీత దంపతులు. వీరి కుమారుడు రోహిత్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా, కుమార్తె ఐశ్వర్య ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా గోవర్ధన్ నడవలేని స్థితిలో ఉన్నాడు. పదేండ్లుగా జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలుగా సునీత పనిచేస్తూ.. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. సోమవారం తెల్లవారు జామున పిల్లలకు వంటచేసి.. ఐదు గంటలకు విధులకు హాజరైన ఆమె.. రాంకోఠిలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లను శుభ్రం చేస్తున్నది. ఉదయం 7.54 గంటల సమయంలో రాంకోఠిలోని ఫుట్‌పాత్ వద్ద ఉన్న చెట్టు సమీపంలో చెత్తను ఊడ్చుతుండగా.. మొయినాబాద్‌లోని అయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీకి చెందిన మినీ బస్సు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఆమెను ఢీకొట్టింది. దీంతో బస్సుకు, చెట్టుకు మధ్యలో సునీత నలిగి పోయింది. ఈ ఘటనలో సునీత తలకు, కాళ్లకు, చేతులకు బలమైన గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి డయల్ 100 కాల్చేసి సమాచారం అందించారు. నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు నరేశ్, షఫీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న సునీతను ఉస్మానియా దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైన బస్సులో 10 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. పారిశుధ్య కార్మికురాలు సునీత మృతి పట్ల హిమాయత్‌నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి రామన్‌గౌడ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, అంబర్‌పేట సర్కిల్-16 డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్‌వో డాక్టర్ జ్యోతిబాయి, బీజేపీ నేత జి.రామన్‌గౌడ్, ఎస్ఎఫ్ఏలు, తోటి కార్మికులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన నాంపల్లి బజార్‌ఘాట్ నివాసి అయిన మినీ బస్సు డ్రైవర్ మహ్మద్ మోమిన్ ఖాన్(65)ను అదుపులోకి తీసుకుని, మినీ బస్సును పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసుల విచారణ తేలింది. ఉస్మానియా మార్చురీలో సునీత మృతదేహానికి పోస్టుమార్టం చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త గోవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
సునీత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం
విధి నిర్వహణలో మృతి చెందిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు సునీత కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. విధుల్లో భాగంగాకోఠిలో స్వీపింగ్ చేస్తున్న సమయంలో కాలేజ్ బస్ సునీతను ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు. ఈ ఘటన పట్ల మేయర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలని జోనల్ కమిషనర్‌ను మేయర్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ఆర్థిక సహాయం అందజేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా.. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని జోనల్ కమిషనర్‌ను మేయర్ ఆదేశించారు. ఘటనపై కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు.