బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 08:12:25

వ్యసనాలకు బానిసై తల్లి, చెల్లిని విషం పెట్టి చంపిన యువకుడు

వ్యసనాలకు బానిసై తల్లి, చెల్లిని విషం పెట్టి చంపిన యువకుడు

  • వ్యసనాలకు బానిసై క్రికెట్‌ బెట్టింగ్‌..
  • రూ.25 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
  • డబ్బుల విషయమై ప్రశ్నించిన తల్లి
  • భోజనంలో పురుగుల మందు కలిపి తల్లి, చెల్లి హత్య.. నిందితుడు అరెస్ట్‌

మేడ్చల్‌ : వ్యసనాలకు బానిసై క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడి.. డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా.. అడిగిన పాపానికి అన్నంలో విషం కలిపి తల్లి, చెల్లిని చంపిన యువకుడిని మేడ్చల్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ప్రవీణ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌ మండలం, రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన పల్లి సాయినాథ్‌రెడ్డి (23) ఎంటెక్‌ చదువుతూ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. తండ్రి మృతి చెందడంతో తల్లి సునీత (44), చెల్లి అనూజ (22)తో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి ఇ టీవల భూమిని అమ్మగా డబ్బులు వచ్చాయి. అయితే.. సాయినాథ్‌రెడ్డి కొంతకాలంగా చెడు అలవాట్లకు బానిసై.. క్రికెట్‌ బెట్టింగ్‌ సైతం ఆడాడు. ఇందులో సుమారు రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ విషయమై తల్లి.. అతడిని ప్రశ్నించింది. దీంతో ఎలాగైనా తల్లి, చెల్లిని చంపాలనుకున్నాడు. ఇందులో భాగంగా నవంబర్‌ 23న సాయంత్రం మేడ్చల్‌లోని ఫెస్టిసైడ్‌ దుకాణం నుంచి  పురుగుల మందును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంట్లో అన్నం వండుతున్న సమయంలో కుక్కర్‌ మూత తీసి పురుగుల మందు కలిపి మూత పెట్టాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా  డ్యూటీకి వెళ్తున్నానని టిఫిన్‌ బాక్సు కూడా తీసుకెళ్లాడు. అనంతరం తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేశాడు. 


రాత్రి భోజనం చేసిన తల్లి సునీత, చెల్లి అనూజ వికారానికి గురై తల తిరుగుతుండగా.. అనూజ అన్నకు ఫోన్‌ చేయగా కలువక పోవడంతో.. తమకు వికారంగా ఉందని, నీవు అన్నం తినకని మెస్సేజ్‌ చేసింది. అనంతరం తల్లి, కూతుళ్లు తీవ్ర అస్వస్థకు గురికాగా వారిని ఇరుగు పొరుగువారు మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు.. అక్కడి నుంచి  మరో ప్రైవేట్‌ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న అనూజ ఈ నెల 26న మృతి చెందగా, మరుసటి రోజు తల్లి మృతి చెందింది. వీరి అంత్యక్రియల అనంతరం సునీత తల్లిగారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయినాథ్‌రెడ్డిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని.. విచారించగా నేరం ఒప్పుకున్నాడు.   logo