మేడ్చల్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేస్తూ.. బినామీ డీలర్లను గుర్తించే పనిలో నిమగ్నమైంది పౌర సరఫరాల శాఖ. ఈ నెల 31 వరకు ఈ ప్రక్రియ చేపట్టి.. బినామీ డీలర్లను ఎరివేయనున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 619 రేషన్ దుకాణాలు ఉంటే.. ఆహార భద్రతా కార్డులు 506163, అంత్యోదయ ఆహార భద్రతా కార్డులు 17676, అన్నపూర్ణ ఆహార భద్రతా కార్డులు 99 ఉన్నాయి.
ప్రతి నెలా వివిధ కార్డులకు 10640.052 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా, గోధుమలు 2023.432 మెట్రిక్ టన్నులు, చక్కెర 17.676 మెట్రిక్ టన్నులను, నిత్యావసర వస్తువులను ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నారు. అయితే రేషన్ దుకాణాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు.. బినామీ డీలర్ల అంశంపై ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించనున్నారు. వీటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు సక్రమంగా అందాలనే బినామీ డీలర్లను ఎరివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.